antony fauci: త్వరలోనే తోకముడవనున్న ఒమిక్రాన్: ఆంటోనీ ఫౌచి అంచనా
- దక్షిణాఫ్రికా అనుభవం ఇదే చెబుతోంది
- కేసుల పెరుగుదలలో మధ్యమ స్థానంలో ఉన్నాం
- త్వరలోనే తగ్గుముఖం పడుతుందని అంచనా
అమెరికాలో కరోనా కేసులు రికార్డు స్థాయి గరిష్ఠాల వద్ద నమోదవుతున్నాయి. గత శుక్రవారం 4,40,000 కేసులు వెలుగుచూశాయి. కానీ, 2021 ఫిబ్రవరి గరిష్టం 2 లక్షల కేసులతో పోలిస్తే రెట్టింపు స్థాయికి చేరినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో మరి కొన్ని వారాల్లోనే అత్యంత గరిష్ఠానికి చేరుకుని, ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా ప్రభుత్వ సలహాదారు ఆంటోనీ ఫౌచి అంచనా వేస్తున్నారు. కరోనా కేసుల గణనీయ పెరుగుదలలో కచ్చితంగా మధ్యమ దశలో ఉన్నామని ఫౌచి చెప్పారు.
‘‘దక్షిణాఫ్రికా అనుభవాలను పరిశీలిస్తే ఇదే తెలుస్తుందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ మొదట దక్షిణాఫ్రికాలోనే 2021 నవంబర్ చివర్లో వెలుగు చూసింది. అత్యంత వేగంగా పెరిగిపోయి స్వల్పకాలంలోనే తగ్గుముఖం పట్టింది. ఇదే పరిస్థితి అమెరికాలోనూ చూస్తాం’’ అని పేర్కొన్నారు. పిల్లలను స్కూళ్లకు పంపే విషయంలో సమస్యలు ఏమీ ఉండబోవన్నారు ఫౌచి.
కానీ, అదే సమయంలో ఆయన దేశ ప్రజలను హెచ్చరించారు కూడా. భారీగా వచ్చే కేసులతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. ‘‘డెల్టాతో పోలిస్తే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఒమిక్రాన్ లో తక్కువే. కానీ, డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ రకంలో ఎన్నో రెట్లు అధికంగా కేసులు వచ్చినప్పుడు ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతుంది’’అని వివరించారు.