Team India: రేపటి నుంచి టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టెస్టు

Team India faces South Africa in second test

  • జోహాన్నెస్ బర్గ్ లో మ్యాచ్
  • మరోసారి టీమిండియా పేసర్లపై అందరి దృష్టి
  • తొలి టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత పేస్ దళం
  • రెండో టెస్టు గెలిస్తే సిరీస్ భారత్ కైవసం

దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయానికి భారత్ మరొక్క విజయం దూరంలో నిలిచి ఉంది. మూడు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన భారత్ రేపటి నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ టెస్టులో నెగ్గితే టీమిండియా సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ గెలిచిన ఘనతను దక్కించుకుంటుంది. అందుకే సర్వశక్తులు ఒడ్డేందుకు కోహ్లీ సేన తీవ్రంగా శ్రమిస్తోంది.

ఈ మ్యాచ్ కు జోహాన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ మైదానం వేదిక. దక్షిణాఫ్రికాలో పిచ్ లు ప్రధానంగా పేస్ కు సహకరిస్తాయని తెలిసిందే. ఆతిథ్య జట్టుకు సొంతగడ్డపై సహజంగానే ఆధిక్యం ఉంటుంది. కానీ తొలి టెస్టు జరిగిన సెంచురియన్ లో భిన్న పరిస్థితి కనిపించింది. దక్షిణాఫ్రికా పేసర్ల కంటే టీమిండియా పేసర్లే పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు.

ఇదే తరహాలో రెండో టెస్టులోనూ పైచేయి సాధించాలని టీమిండియా పేస్ దళం ఉరకలేస్తోంది. బుమ్రా, షమీలకు తోడు సిరాజ్ కూడా రాణిస్తుండడం భారత శిబిరంలో ఉత్సాహం నింపుతోంది. కాగా, జోహాన్నెస్ బర్గ్ పిచ్ ను రేపు (సోమవారం) మరోమారు పరిశీలించిన అనంతరం జట్టులో మరో పేసర్ ను తీసుకునే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ పేసర్ ను తీసుకుంటే స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ తన స్థానాన్ని కోల్పోకతప్పదని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

అటు, దక్షిణాఫ్రికా సీనియర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో, అతడి స్థానాన్ని మరో వికెట్ కీపర్ కైల్ వెర్రీన్ తో భర్తీ చేశారు.

చివరిసారిగా భారత్ ఇక్కడి వాండరర్స్ మైదానంలో 2018లో ఆడింది. ఆ సమయంలో పిచ్ మరీ దారుణంగా ఉండడంతో ఆట నిలిపివేశారు. పిచ్ సన్నద్ధత లోపం కారణంగా క్యూరేటర్ పై వేటు పడింది. అంతేకాదు, ఈ మైదానానికి ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు విధించింది. మరి ఈసారి ఇక్కడి పిచ్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News