Asaduddin Owaisi: ఇలాంటివారిని ఊరికే వదలకూడదు: యాప్ లో ముస్లిం మహిళల వేలంపై ఒవైసీ ఆగ్రహం
- 'గిట్ హబ్' వేదికగా 'బుల్లి బాయి' యాప్
- యాప్ లో వందలాది ముస్లిం మహిళల ఫొటోలు
- వేలానికి మహిళలు అంటూ ప్రచారం
- 'చెదపురుగులు' అంటూ మండిపడిన ఒవైసీ
ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 'గిట్ హబ్' వేదికగా కార్యకలాపాలు నిర్వహించే 'బుల్లి బాయి' అనే యాప్ లో ముస్లిం మహిళల ఫొటోలు పోస్టు చేస్తూ వారిని వేలం వేస్తున్నట్టు ప్రచారం చేస్తుండడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఊరికే వదలరాదని మండిపడ్డారు. ఇలాంటి చెదపురుగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ తెలంగాణ సీఎం కార్యాలయాన్ని, మంత్రి కేటీఆర్ ను, తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను డిమాండ్ చేశారు.
ఏదో నామమాత్రపు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదని, నిందితులను చట్టం ముందుకు తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ఘటనలో తెలంగాణ పోలీసు విభాగంలోని కౌంటర్ ఇంటెలిజెన్స్, యాంటీ రాడికలైజేషన్ దళాల సేవలను వినియోగించుకోవాలని ఒవైసీ పేర్కొన్నారు.
'బుల్లి బాయి' యాప్ లో వేలం వేస్తున్న మహిళల ఫొటోల్లో తనది కూడా అప్ లోడ్ చేశారంటూ ఆయేషా మినాజ్ అనే మహిళా పాత్రికేయురాలు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పట్ల స్పందిస్తూ ఒవైసీ పైవిధంగా వ్యాఖ్యానించారు.