siviour headache: తల పగిలిపోతోందా..? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే..!

When should you go to hospital for a headache

  • మైగ్రేయిన్ తలనొప్పా? లేక నిద్రలేమి కారణమా?
  • ఒత్తిళ్లు ఉన్నాయా? అధిక రక్తపోటు ఉందా?
  • కారణాలు గుర్తిస్తే సమస్యకు పరిష్కారం
  • నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవాలి

నిత్యజీవితంలో కొన్ని సందర్భాల్లో భరించలేనంత తలనొప్పిని కొందరు ఎదుర్కొంటుంటారు. చాలా మంది దీన్ని సాధారణంగానే తీసుకుంటుంటారు. కొంతమంది నొప్పి నివారణకు ఏదో ఒక మాత్ర వేసుకుని విశ్రాంతి తీసుకుంటారు. కానీ, కొన్ని రకాల తలనొప్పులను తేలిగ్గా తీసుకోకూడదు. కారణాన్ని కనుగొని చికిత్స తీసుకోవాలి.

ఎప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో తలనొప్పి వేధిస్తుంటే, శారీరక వ్యాయామం లేదా శృంగారంలో పాల్గొన్న తర్వాత తలనొప్పి మరింత అధికమవుతుంటే, తలనొప్పితోపాటు మెడ పట్టేసి ఉంటే, టాబ్లెట్లు వేసుకున్నా కానీ, అధిక జ్వరం ఉపశమించకుండా కొనసాగితే, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు అయినా కానీ తలనొప్పి తగ్గకుండా కొనసాగుతుంటే..

ప్రమాదం అనంతరం తలనొప్పి తగ్గకుండా బాధిస్తుంటే, వ్యక్తి ప్రవర్తన, మూడ్ లో మార్పులు వస్తే, తలనొప్పితో పాటు బలహీనత, శరీరంలో ఒక వైపు భాగం చచ్చుపడి పోతున్నట్టు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.

చాలా వరకు తలనొప్పులతో ప్రమాదం లేదు. వాటిని ఆసుపత్రికి వెళ్లకుండానే మేనేజ్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి కొన్ని ప్రమాదకరమైన తలనొప్పులను నిర్లక్ష్యం చేయరాదు. ఒంట్లో తగినంత నీరు లేకపోవడం (డీహైడ్రేషన్) వల్ల కూడా తలనొప్పి వస్తుంటుంది. తగినంత విశ్రాంతి లేకపోయినా, ఒత్తిళ్లు పెరిగిపోయినా దీనికి దారితీయవచ్చు.

నొప్పి ఏ భాగంలో వస్తుందన్న దాని ఆధారంగా సమస్య కారణాన్ని గుర్తించే వీలుంటుంది. 35 శాతం తలనొప్పులు ఒత్తిడి వల్ల వచ్చేవే. తలచుట్టూ బ్యాండ్ కట్టిన మాదిరిగా నొప్పి ఉంటుంది. 4 శాతం క్లస్టర్ తలనొప్పులు ఇవి కళ్ల వెనుక నుంచి మొదలవుతాయి. ఆ సందర్భంలో కళ్లు ఎర్రబారతాయి.

మైగ్రేయిన్ తలనొప్పి కూడా కావచ్చు. వాంతి అవుతున్నట్టు, తల తిరుగుతున్నట్టు అనిపించడం, తల పగిలిపోతున్నట్టు నొప్పి రావడం, వెలుగును చూడలేకపోవడం, చూపు మసకబారడం ఇవన్నీ మైగ్రేయిన్ నొప్పికి సూచనలు. కొన్ని రకాల తలనొప్పులు చూడ్డానికి మైగ్రేయిన్ గా అనిపిస్తాయే కానీ వాటి కారణాలు వేరే అయి ఉంటాయి.

కొన్ని రకాల ఆహారాలు, నిద్రలేమి, కొన్ని రకాల వాసనలు, మానసిక పరమైన ఒత్తిడి తలనొప్పిని పెంచొచ్చు. స్త్రీలలో రుతుచక్రం గతి తప్పినా తలనొప్పి వేధిస్తుంటుంది. అధిక రక్తపోటు కూడా తలనొప్పికి కారణమవుతుంది. కనుక తలనొప్పికి కారణాన్ని గుర్తించడం ద్వారా పరిష్కరించుకోవాలి. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే సీటీ స్కాన్, ఎంఆర్ఐ ద్వారా వైద్యులు సమస్య ఉందేమో కనుగొనే ప్రయత్నం చేస్తారు.

  • Loading...

More Telugu News