Economically Weaker Section: ఆర్థికంగా బలహీన వర్గాల వారికి రూ.8 లక్షల పరిమితే అమలు: సుప్రీంకోర్టుకు కేంద్రం
- కాలేజీల్లో సీట్లు కేటాయిస్తున్న తరుణంలో సవరణలు వద్దు
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తాం
- సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
ఆర్థికంగా బలహీన వర్గాల వారి (ఈడబ్ల్యూఎస్) గుర్తింపునకు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే ప్రస్తుత విద్యా సంవత్సరానికి వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు అమలు చేస్తామంటూ సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు ఒక అఫిడవిట్ ను దాఖలు చేసింది.
నీట్ రాసిన విద్యార్థులకు ప్రవేశాలు, కాలేజీలను కేటాయిస్తున్న ఈ తరుణంలో నిబంధనలను మార్చడం వల్ల సమస్యలు ఏర్పడతాయని పేర్కొంది. సవరించిన నిబంధనలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు తెలిపింది.
నిజానికి సవరించిన నిబంధనల్లో రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిని కేంద్ర సర్కారు కొనసాగించింది. వ్యవసాయ భూమి ఐదు ఎకరాలు అంతకంటే ఎక్కువ ఉన్న వారిని మినహాయించింది. రూ.8 లక్షల ఆదాయ పరిమితిని క్రితం విచారణ సందర్బంగా కేంద్రం సమర్థించుకుంది.
కానీ, ఎటువంటి ప్రాతిపదికన ఆదాయ పరిమితి నిర్ణయించారని కోర్టు నిలదీసింది. గ్రామంలోని ఒక వ్యక్తి ఆదాయం.. మెట్రోలో ఉన్న వ్యక్తి ఆదాయానికి సమానంగా ఎలా ముడిపెడతారంటూ? ప్రశ్నించింది. దీంతో నిబంధనలు సవరిస్తామని కేంద్రం కోర్టుకు హామీ ఇచ్చింది.