Vishnu Vardhan Reddy: 'ఏపీ మరో రికార్డ్!'... మద్యం అమ్మకాలపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యంగ్యం
- డిసెంబరు 31న ఏపీలో భారీగా మద్యం అమ్మకాలు
- ఒక్కరోజే రూ.124 కోట్ల ఆదాయం
- స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి
- పాదయాత్ర హామీ అమలు చేయాలని హితవు
డిసెంబరు 31న ఏపీలో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. ఒక్కరోజులోనే రాష్ట్ర అబ్కారీ శాఖకు రూ.124 కోట్ల మేర ఆదాయం వచ్చింది. దీనిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఏపీ మరో రికార్డ్ సాధించింది... ఎందులో అనుకుంటున్నారు? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
ఒక్కరోజులో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు రూ.124.10 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. డిసెంబరు 30, 31 తేదీల్లో మొత్తం రూ.215 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు తెలిపారు. మద్యం అమ్మకాలపై రోజువారీగా రూ.70 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు వస్తోందని వివరించారు. 'కనీసం ఈ సంవత్సరంలోనైనా మీ పాదయాత్ర హామీ మేరకు మద్యాన్ని పేదలకు దూరం చేయండి జగన్ గారూ' అంటూ హితవు పలికారు.