Samir Dar: పుల్వామా దాడిలో పాలుపంచుకున్న చివరి టెర్రరిస్టును కూడా మట్టుబెట్టిన భారత సైన్యం
- 2019లో కశ్మీర్ లోని పుల్వామాలో భారీ ఉగ్రదాడి
- సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై విరుచుకుపడిన టెర్రరిస్టులు
- 40 మంది జవాన్ల మృతి
- డిసెంబరు 30న అనంతనాగ్ జిల్లాలో ఎన్ కౌంటర్
- ముగ్గురు ఉగ్రవాదుల మృతి
మూడేళ్ల కిందట 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు విరుచుకుపడిన ఆనాటి ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. కాగా, పుల్వామా ఉగ్రదాడిలో పాల్గొన్న చివరి టెర్రరిస్టును కూడా భారత బలగాలు కాల్చి చంపాయి. పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గతంలో పలు ఎన్ కౌంటర్లలో సైన్యం తుదముట్టించింది. తాజా ఘటనతో పుల్వామా ముష్కరులు అందరినీ అంతమొందించినట్టయింది.
కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో సమీర్ దార్ అనే ఈ ఉగ్రవాదిని హతమార్చినట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. సమీర్ దార్ జైషే ఉగ్రవాద సంస్థలో అగ్రశ్రేణి కమాండర్. డిసెంబరు 30న జరిగిన ఎన్ కౌంటర్ లో సమీర్ దార్ తో పాటు మరో ఇద్దరిని కూడా మట్టుబెట్టినట్టు విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటన మొన్ననే జరిగినప్పటికీ, డీఎన్ఏ టెస్టులు జరిపిన అనంతరం సమీర్ దార్ గుర్తింపును నిర్ధారించారు.