maadhaar app: ఆధార్ యాప్ తో ఎన్ని ఉపయోగాలో.. తెలుసుకోండి!
- గుర్తింపు ధ్రువీకరణగా పనికొస్తుంది
- రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో చూపించొచ్చు
- చిరునామా అప్ డేట్ చేసుకోవచ్చు
- వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోవచ్చు
నేడు అన్ని ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలకు ఆధార్ అవసరమవుతోంది. అంతేకాదు రైల్ టికెట్ బుకింగ్ లకు, గుర్తింపు, చిరునామా ధ్రువీకరణగా ఆధార్ కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అన్ని సందర్భాల్లోనూ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. వెంట ఆధార్ కార్డు లేకపోయినా కానీ, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఎంఆధార్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే .. పలు సందర్భాలలో ఉపయోగపడుతుంది.
గుర్తింపు కార్డు చూపించాలంటూ ఎవరైనా కోరినప్పుడు ఎంఆధార్ యాప్ ను ఓపెన్ చేసి చూపిస్తే చాలు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రైళ్లలోనూ దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంఆధార్ యాప్ తో చిరునామాను అప్ డేట్ చేసుకోవచ్చు. యాప్ లోని ఆధార్ సింక్ ఫీచర్ ఇందుకు ఉపయోగపడుతుంది. ఎంఆధార్ యాప్ ఒక్కరి మొబైల్ లో ఉన్నప్పటికీ అందులోనే కుటుంబ సభ్యులు ఐదుగురి ఆధార్ కార్డులను నిర్వహించుకునే వెసులుబాటు ఉంది.
కాగిత రహిత ఈకేవైసీ లేదా క్యూఆర్ కోడ్ ను టెలికం కంపెనీలకు షేర్ చేయవచ్చు. యాప్ నుంచే తమ ఆధార్ లేదా బయోమెట్రిక్ ను మరెవరూ యాక్సెస్ చేయకుండా లాక్ చేసుకోవచ్చు.
వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోవచ్చు. అంటే అసలు ఆధార్ నంబర్ ఇవ్వడానికి బదులు.. తాత్కాలికంగా యూఐడీఏఐ జారీ చేసే వర్చువల్ ఐడీతో ఆధార్ నంబర్ దుర్వినియోగానికి అవకాశం ఉండదు. ఇంకా మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.