Chetan Sharma: మరోసారి తెరపైకి టీమిండియా కెప్టెన్సీ వివాదం!
- టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ
- కొనసాగాలని కోహ్లీని కోరామన్న చీఫ్ సెలక్టర్
- కోహ్లీ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్య
- అతడికి సొంత ప్రణాళికలు ఉన్నాయని వివరణ
ఇటీవల టీ20 వరల్డ్ కప్ ముగిసింది మొదలు... భారత క్రికెట్ వర్గాల్లో కెప్టెన్సీ అంశం అత్యధికంగా చర్చకు వస్తోంది. ఆ టోర్నీలో భారత్ పేలవ ప్రదర్శన కనబర్చడం, టీ20 ఫార్మాట్లో కెప్టెన్ గా అదే తనకు చివరి టోర్నీ అని విరాట్ కోహ్లీ ప్రకటించడం విమర్శకులకు కావల్సినంత సరంజామా అందించింది. అయితే తాము కోహ్లీని టీ20 ఫార్మాట్లో కెప్టెన్ గా కొనసాగాలని కోరామని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఇటీవల చెప్పగా, తనను ఎవరూ సంప్రదించలేదని కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించడంతో వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం కోహ్లీ టీమిండియా టెస్టు జట్టుకు మాత్రమే కెప్టెన్. వన్డే, టీ20 జట్లలో ఓ ఆటగాడు మాత్రమే. కాగా, భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన తాజా వ్యాఖ్యలతో కెప్టెన్సీ వివాదం మరోసారి రాజుకుంది.
టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగుతానని కోహ్లీ చెప్పడంతో నాడు సెలక్షన్ కమిటీ సభ్యులందరూ ఆశ్చర్యపోయారని చేతన్ శర్మ వెల్లడించాడు. తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని తనతో సహా సెలక్షన్ కమిటీ సభ్యులందరూ కోహ్లీకి విజ్ఞప్తి చేశారని తెలిపాడు. టీ20 సారథిగా కోహ్లీ కొనసాగాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నాడు. బోర్డు తరఫున తనతో ఎవరూ ఈ విషయం చర్చించలేదని కోహ్లీ అనడం పట్ల చేతన్ శర్మ విభేదించాడు.
టీ20 వరల్డ్ కప్ కు ముందే కెప్టెన్సీ వదులుకుంటున్న విషయం చెప్పాడని, అయితే కోహ్లీ నిర్ణయం ప్రభావం వరల్డ్ కప్ లో జట్టుపై పడుతుందని తామందరం ఆందోళన చెందామని వివరించాడు. కెప్టెన్సీ అంశంపై టోర్నీ ముగిశాక చర్చిద్దామని కోహ్లీకి నచ్చచెప్పే ప్రయత్నం చేశామని వెల్లడించాడు. ఆ సమయంలో సెలక్టర్లు, కన్వీనర్లు, బోర్డు అధికారులు అందరూ ఉన్నారు, కోహ్లీతో మాట్లాడనిది ఎవరు? అని ప్రశ్నించాడు.
వరల్డ్ కప్ తర్వాత తనకంటూ సొంత ప్రణాళికలు ఉండడంతో తాము వాటిని గౌరవించామని చేతన్ శర్మ స్పష్టం చేశాడు. ఇక, కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై వివరణ ఇస్తూ, గందరగోళానికి తావు ఉండరాదనే పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఒకే కెప్టెన్ ఉండాలని నిర్ణయించామని స్పష్టం చేశాడు.