GST Council: వస్త్రాలపై జీఎస్టీ పెంపు ఇప్పట్లో లేనట్టే.. వాయిదా వేసిన జీఎస్టీ కౌన్సిల్!

GST Council decides to defer rate hike on textiles

  • ఫిబ్రవరి సమావేశంలో తిరిగి సమీక్ష
  • ప్రస్తుతం అమల్లో ఉన్న రేటు 5 శాతం
  • జనవరి 1 నుంచి 12 శాతం చేయాలని లోగడ నిర్ణయం
  • తీవ్ర వ్యతిరేకతతో వాయిదా వేసిన జీఎస్టీ కౌన్సిల్

దేశ ప్రజల్లో ఎక్కువ మందిపై భారం మోపే నిర్ణయం వాయిదా పడింది. టెక్స్ టైల్స్ (వస్త్రాలు)పై ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ రేటు అమలవుతోంది. దీన్ని 2022 జనవరి 1 నుంచి 12 శాతంగా అమలు చేయాలని లోగడ నిర్ణయించారు. దీనిపై దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

ఈ నేపథ్యంలో నేడు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పెంపును వాయిదా వేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో నిర్వహించే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీన్ని సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నట్టు హిమాచల్ ప్రదేశ్ పరిశ్రమల మంత్రి బిక్రమ్ సింగ్ వెల్లడించారు.

తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ సైతం రేట్ల పెంపును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడుతుందన్నారు. వస్త్ర పరిశ్రమతో పాటు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి.

పేదలకు వస్త్రాలు భారంగా మారతాయని.. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) నిబంధనల అమలు భారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తం అయింది. ప్రధానంగా గుజరాత్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. శుక్రవారం నాటి సమావేశంలో ఇదే ప్రధాన అజెండా కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News