Tollywood: ఏపీలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల వర్గీకరణపై కమిటీ కీలక భేటీ
- 13 మంది సభ్యులతో ఇటీవలే కమిటీ ఏర్పాటు
- వర్చువల్ గా సమావేశమైన సభ్యులు
- ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ
- అన్ని అంశాలపై చర్చలు
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం, థియేటర్ల మూసివేతపై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఇటీవలే వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కమిటీలో ఉన్నతాధికారులు, ఎగ్జిబిటర్లు, సినీగోయర్లను నియమించింది.
సినిమా టికెట్ ధరలు తగ్గించడంపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు స్పందిస్తూ జీవో 35 ప్రకారం టికెట్లు విక్రయిస్తే థియేటర్ల మూతే మార్గమని తెలపడంతో దీనిపై కమిటీ సభ్యులు అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. వారి తొలి సమావేశం ఈ రోజు ప్రారంభమైంది. సినిమా టికెట్ల ధరలుతో పాటు థియేటర్లలో వసతుల కల్పనపై వారు చర్చలు జరుపుతున్నారు.
హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది. కమిటీలోని 13 మంది సభ్యులు ఈ సమావేశంలో వేర్వేరు ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. టికెట్ ధరలతో పాటు థియేటర్లలో ప్రేక్షకులకు అవసరమైన వసతులు, థియేటర్ల గ్రేడింగ్‌పై సమావేశంలో చర్చిస్తున్నారు. సినిమా టికెట్ల ధరలపై తగ్గింపు సరికాదని కొందరు సినీ ప్రముఖులు అంటుండగా, ప్రేక్షకులపై అదనపు భారం లేకుండా చూడాలని ఫిలిం క్రిటిక్స్ ప్రేక్షకుల సంఘం విజ్ఞప్తి చేసింది.
దీంతో కమిటీ ఇచ్చే నివేదికపై ఆసక్తి నెలకొంది. ఈ కమిటీలో హోం, రెవెన్యూ, పురపాలక, ఆర్థిక, సమాచార, న్యాయశాఖ ప్రతినిధులతో పాటు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఉన్నారు. సినిమా థియేటర్ల వర్గీకరణ, ధరలపై కమిటీ కొన్ని రోజుల్లోనే ప్రతిపాదనలు పంపనుంది. ఏపీలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల విషయంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు తమను ఇబ్బంది పెడుతున్నాయని థియేటర్ల యజమానులు ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపారు. థియేటర్లలోని స్నాక్స్ వంటివి విక్రయించేవారు కూడా జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తోందని వివరించారు. వారందరితోనూ కమిటీ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.