anagani: రీల్ హీరోలుగానే మిగిలిపోతారా? రియల్ హీరోలుగా మారరా?: టీడీపీ ఎమ్మెల్యే అనగాని
- జగన్ వేధింపులకు గురి చేస్తుంటే నోరు మెదపట్లేదు
- సినీ పెద్దలు ఎందుకు స్పందించట్లేదు
- తనిఖీల పేరుతో థియేటర్ల మూత
- తమిళనాడులో హీరోలు సమస్యలపై స్పందిస్తారు
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేత, తనిఖీల విషయంలో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీనిపై సినీ పెద్దలు ఎందుకు స్పందించట్లేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడ్డారని ఆయన అన్నారు.
ఇప్పుడు ఏపీలో తనిఖీల పేరుతో థియేటర్లు మూతపడుతుండడంతో చాలా మంది ఉపాధి కోల్పోతున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వేధింపులకు గురి చేస్తుంటే సినీ పెద్దలు నోరు మెదపట్లేదని ఆయన విమర్శించారు. ఏపీలో హీరోలు రీల్ హీరోలుగానే మిగిలిపోతున్నారని, వారు రియల్ హీరోలుగా మారరా? అని అనగాని సత్యప్రసాద్ నిలదీశారు.
కావేరి నదీ జలాల సమస్యపై అక్కడి సినీ పరిశ్రమ అంతా ఏకతాటిపైకి వచ్చారని, జల్లికట్టు అంశంపై కూడా తమిళ హీరోలంతా స్పందించారని ఆయన గుర్తు చేశారు. ఇక్కడి హీరోలు మాత్రం సమస్యలపై ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు.
వారి సినిమాలు ప్రజలు చూడాలి కానీ, ప్రజల కష్టాలు మాత్రం ఈ సినిమా హీరోలకు పట్టవా? అని అనగాని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులను కూడా ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు. ఇప్పుడు థియేటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని ఆయన అన్నారు.
కాగా, ఏపీలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేత అంశంపై ఇప్పటికే సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి పలువురు థియేటర్ల యజమానులతో కలిసి ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం సీజ్ చేసిన థియేటర్లలో సౌకర్యాలు కల్పించి తెరుచుకోవచ్చని ఏపీ సర్కారు నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేసింది.