ipos: 2022లో రూ.2 లక్షల కోట్ల ఐపీవోలు.. ఎల్ఐసీ నుంచి అతి పెద్ద ఇష్యూ
- రూ.లక్ష కోట్లను సమీకరించనున్న ఎల్ఐసీ
- జాబితాలో అదానీ విల్ మార్, జెమిని ఎడిబుల్స్, వీఎల్ సీసీ హెల్త్ కేర్
- 2021లో 65 ఐపీవోలు
- రూ.1.3 లక్షల కోట్ల సమీకరణ
వచ్చే ఏడాది ప్రైమరీ మార్కెట్ నుంచి నిధుల సమీకరణకు చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది 65 ఐపీవోలు రూ.1.3 లక్షల కోట్లను సమీకరించుకోగా.. 2022లో రూ.2 లక్షల కోట్ల మేర ఇష్యూలు రానున్నాయి. ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీ భారీ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది.
2021లో ఈక్విటీ మార్కెట్ మంచి ర్యాలీని చూసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. మధ్యలో కొన్ని రోజుల పాటు అనిశ్చితులు ఉన్నా కానీ మొత్తం మీద ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. నూతన తరం కంపెనీలైన జొమాటో, పాలసీ బజార్, నైకా తదితర కంపెనీలు విజయవంతంగా లిస్ట్ అయ్యాయి. మార్కెట్ బూమ్ లో ఉండడం, రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం పెరిగిపోవడంతో చాలా ఇష్యూలు గణనీయమైన స్పందన అందుకున్నాయి.
ఇక 2022 ఆరంభంలోనే ప్రభుత్వరంగ ఎల్ఐసీ ఐపీవో రానుంది. సుమారు రూ.70,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లను ప్రభుత్వం ఎల్ఐసీలో తన వాటా 10 శాతం వరకు విక్రయించడం ద్వారా సమకూర్చుకోనుంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్న ఆదాయానికి ఈ ఇష్యూ కీలకం కానుంది.
ఐపీవోకు వెళ్లేందుకు సెబీ నుంచి అనుమతులు లభించిన కంపెనీల్లో.. అదానీ విల్ మార్, గో ఎయిర్ లైన్స్, స్కాన్ రే టెక్నాలజీస్, ఎమ్ క్యూర్ ఫార్మా, ట్రాక్సన్ టెక్నాలజీస్, మొబిక్విక్, వీద క్లినిక్, వీఎల్ సీసీ హెల్త్ కేర్, ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, స్టెరిలైట్ పవర్ ట్రాన్స్ మిషన్, జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ (ఫ్రీడమ్ వంట నూనెల కంపెనీ), గోదావరి బయో రిఫైనరీస్ ఇంకా చాలానే ఉన్నాయి.
ఓలా, డెల్హివరీ, ఓయో, డ్రూమ్ టెక్నాలజీస్, ఫార్మ్ఈజీ, స్నాప్ డీల్ తదితర సంస్థలు కూడా ఐపీవోకు వచ్చే సన్నాహాలతో ఉన్నాయి. ఎల్ఐసీ ఇష్యూతో పాటు, నూతనతరం కంపెనీల ఇష్యూల పట్ల మార్కెట్లో ఆసక్తి నెలకొంది.