Telangana: వరదల ఎఫెక్ట్: హైదరాబాద్ లో నాలాల విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం

Telangana Government To Develop Nalas In Hyderabad

  • స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్
  • తొలి దశలో రూ.858 కోట్లతో అభివృద్ధి
  • హుస్సేన్ సాగర్ వరద నాలా పొడవునా గోడ
  • ప్రకటించిన మున్సిపల్ మంత్రి కేటీఆర్
  • నల్లకుంటలో రక్షణ గోడకు శంకుస్థాపన

హైదరాబాద్ మహానగరంలో గత ఏడాది వరదలకు సామాన్య జనం ఎంతలా అతలాకుతలమయ్యారో తెలిసిందే. గత అనుభవాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టింది. నాలాల విస్తరణకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండు దశల్లో సిటీల్లోని నాలాలను అభివృద్ధి చేసేందుకు చర్యలను మొదలుపెట్టింది.

మొదటి దశలో భాగంగా సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో రూ.858 కోట్లతో నాలాలను విస్తరించనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అందులో భాగంగానే హుస్సేన్ సాగర్ నుంచి మొదలై మూసీలో కలిసే వరకు వరద నీటి నాలాకు రెండు వైపులా రూ.68.4 కోట్ల వ్యయంతో రక్షణ గోడను నిర్మిస్తామని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని నల్లకుంటలో నాలా రక్షణగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. సమస్యాత్మక నాలాలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు.  

గత ఏడాది ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు కుంభవృష్టి కురిసిందని, ఆ వర్షాలకు నల్లకుంట, ఇతర ప్రాంతాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రత్యక్షంగా చూశామని చెప్పారు. ఆనాడు మున్సిపల్ మంత్రిగా స్వయంగా తానే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానని, వరద బాధిత కుటుంబాలతో మాట్లాడానని గుర్తు చేశారు.

హుస్సేన్ సాగర్ నుంచి నల్లకుంట వరకు వరద నీటి నాలాకు రిటెయినింగ్ వాల్ కట్టాలంటూ బస్తీవాసులు విజ్ఞప్తి చేశారన్నారు. 70 ఏళ్లలో కనీసం మూడు కిలోమీటర్లు కూడా గోడ కట్టలేదని, మీరైనా కట్టాలంటూ వారు కోరారని గుర్తు చేశారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన నాలాల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ‘స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్’ను చేపట్టామని కేటీఆర్ తెలిపారు.

మొదటి దశ కింద నాలాల అభివృద్ధి కోసం రూ.858 కోట్లను మంజూరు చేశామని చెప్పారు. పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడిన ప్రాంతాలకు ముందుగా ప్రాధాన్యం ఇస్తామన్నారు. రెండో దశలో మరిన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నాలాలను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారన్నారు.

తొలిదశలో సికింద్రాబాద్ లో రూ.163 కోట్లతో నాలాలను అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చెప్పారు. కూకట్ పల్లి జోన్ లో రూ.112.80 కోట్లు, ఎల్బీనగర్ జోన్ లో రూ.113.59 కోట్లు, ఖైరతాబాద్ జోన్ లో రూ.100.26 కోట్లు, చార్మినార్ జోన్ లో రూ. 85.61 కోట్లు, శేరిలింగంపల్లి జోన్ లో రూ.57.74 కోట్లతో నాలా పనులు చేపడతామని వెల్లడించారు.

ఈ పనుల్లో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే రూ.633 కోట్ల పనులు చేస్తున్నామన్నారు. మీర్ పేట కార్పొరేషన్ పరిధిలో 45.62 కోట్లు, బడంగ్ పేట్ మున్సిపాలిటీలో రూ.23.94 కోట్లు, జల్ పల్లిలో రూ.24.85 కోట్లు, పెద్ద అంబర్ పేట్ పరిధిలో రూ.32.42 కోట్లు, నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో రూ.84.63 కోట్లు, కొంపల్లి పరిధిలో రూ.13.86 కోట్లతో పనులు చేపడతామన్నారు.

వచ్చే వర్షాకాలం జూన్ లోపు హుస్సేన్ సాగర్ వరద నాలా రక్షణ గోడను కట్టి తీరాలని అధికారులకు కేటీఆర్ ఆదేశాలిచ్చారు. ప్రతి పది రోజులకోసారి మంత్రులు కూడా ఆయా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ముషీరాబాద్ వద్ద నాలా అభివృద్ధి పనుల వల్ల 400కుపైగా కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉండడంతో.. ఆ నష్టాన్ని కేవలం 20కి కుదించి అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనే నాలా రిటెయినింగ్ వాల్ ను నిర్మించనున్నామని పేర్కొన్నారు. ముషీరాబాద్ ప్రజలు దానికి సహకరించి పనులు వేగంగా అయ్యేలా చూడాలని ఆయన కోరారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News