New Delhi: లెవల్-2 ఆంక్షల దిశగా ఢిల్లీ.. 1 శాతం దాటిన పాజిటివ్ రేటు!
- వారంలో ఏడు రెట్లు పెరిగిన కేసులు
- బుధవారం టెస్ట్ పాజిటివ్ రేటు 1.29 శాతం
- తదుపరి ఆంక్షలపై కొన్ని రోజులు వేచి చూసే ధోరణి
కరోనా ఢిల్లీ యంత్రాంగాన్ని మరోసారి వణికిస్తోంది. గతేడాది భారీ కేసులతో సతమతం అయిన ఢిల్లీ.. తాజాగా మళ్లీ కేసుల తీవ్రతను చూస్తోంది. వారం రోజుల క్రితం ఇక్కడ కేసుల సంఖ్య 125 కాగా, బుధవారం నమోదైన కేసులు 923. చేస్తున్న పరీక్షల్లో పాజిటివ్ రేటు 0.50 శాతం దాటడంతో ఇక్కడ లెవల్ 1 ఆంక్షలను (ఎల్లో అలర్ట్) అమల్లోకి తీసుకొచ్చారు.
దీంతో బహిరంగ సమావేశాలు, సభలను నిషేధించడంతో పాటు.. రాత్రుళ్లు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. థియేటర్లు, పబ్ లు, జిమ్ లు వంటి వ్యాప్తికి అవకాశం ఉన్న వాటిని మూసివేయించారు. అయినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో లెవల్-2 ఆంక్షలను (అంబర్ అలర్ట్) ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీలో చేస్తున్న మొత్తం పరీక్షల్లో పాజిటివ్ కేసుల రేటు 1.29 శాతానికి చేరింది. మంగళవారం కూడా పాజిటివ్ రేటు ఒక శాతంపైనే నమోదైంది. అయితే కేసులు పెరుగుతున్న స్థాయిలో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య లేదు. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగానే ఉన్నందున మరికొన్ని రోజుల పాటు ఎల్లో అలర్ట్ నే కొనసాగించాలనే ఆలోచనతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఉంది.