CM Jagan: బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ను ఘనంగా సన్మానించిన సీఎం జగన్... ఐదు ఎకరాల స్థలం మంజూరు

- వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో శ్రీకాంత్ కు రజతం
- ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు శ్రీకాంత్
- కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లి వచ్చిన శ్రీకాంత్
- రూ.7 లక్షల నగదు పురస్కారం ప్రకటించిన సీఎం
- తమ్ముడివంటూ ఆప్యాయంగా మాట్లాడిన జగన్
ఇటీవల స్పెయిన్ లో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజతం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ ను ఏపీ సీఎం జగన్ ఘనంగా సత్కరించారు. కిడాంబి శ్రీకాంత్ ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్... వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీల్లో అద్భుత పోరాటం కనబర్చిన శ్రీకాంత్ ను అభినందించారు. అప్పటికప్పుడు రూ.7 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. అంతేకాదు, తిరుపతిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాల స్థలం మంజూరు చేస్తామని తెలిపారు.
దీనిపై కిడాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ, సీఎం జగన్ ను కలవడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. సీఎం జగన్ తనను ఓ తమ్ముడుగా పేర్కొన్నారని, ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని వెల్లడించాడు. ఎలాంటి అవసరం వచ్చినా తన కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పారని శ్రీకాంత్ తెలిపాడు. తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదు ఎకరాల స్థలం ఇస్తున్నారని, ఇప్పటివరకు తనకు ఎంతో సాయపడ్డారని వివరించాడు.
