Justice N.V. Ramana: జడ్జిలను జడ్జిలే నియమిస్తారనడం పెద్ద భ్రమ: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
- అన్ని వ్యవస్థల్లాగే న్యాయవ్యవస్థ కూడా ఓ పావేనన్న జస్టిస్ రమణ
- జడ్జిల నియామకాల్లో చాలా మంది పాత్ర ఉంటుంది
- అనుకూలంగా తీర్పివ్వకుంటే దాడులు చేస్తున్నారు
- కోర్టులు స్పందించేంత వరకు అధికారులు పట్టించుకోవట్లేదు
జడ్జిల నియామకాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారనడం అతిపెద్ద భ్రమ అని అన్నారు. ఇటీవల పార్లమెంట్ లో ‘ద హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ (శాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్) సవరణ బిల్లు 2021’ చర్చ సందర్భంగా కేరళ ఎంపీ జాన్ బ్రిట్టీస్.. జడ్జిలను జడ్జిలే నియమించడమేంటని, దానిని తానెక్కడా వినలేదని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపైనే ఆయన ఇవాళ విజయవాడలోని సిద్ధార్థ లా కాలేజీలో నిర్వహించిన లావు వెంకటేశ్వర్లు ఎండోమెంట్ లెక్చర్ కార్యక్రమంలో ‘భారత న్యాయవ్యవస్థ– భవిష్యత్ సవాళ్లు’ అనే అంశంపై మాట్లాడుతూ స్పందించారు.
ఇటీవలి కాలంలో జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయని, అయితే, ప్రచారంలో ఉన్న భ్రమ అని అన్నారు. మిగతా అన్ని వ్యవస్థల్లాగే న్యాయవ్యవస్థ కూడా ఆటలో ఓ పావే అని అన్నారు. జడ్జిల నియామకాల్లో కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. జడ్జిల నియామకాల్లో ఇంత జరుగుతున్నా, అది తెలిసిన వాళ్లు కూడా ‘జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే ఎన్నెన్నో నిందలు వేస్తున్నారని, శారీరక దాడులకూ దిగుతున్నారని ఆయన అన్నారు. ఆ ఘటనలపై కోర్టులు స్పందించేంత వరకూ ఏ అధికారులూ స్పందించడం లేదని, ఘటనలపై దర్యాప్తు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు సురక్షితమైన వాతావరణం కల్పించినప్పుడే జడ్జిలు నిర్భయంగా పనిచేయగలుగుతారని సీజేఐ జస్టిస్ రమణ అన్నారు.
దురదృష్టంకొద్దీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లంతా ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వాల చేతుల్లో కీలు బొమ్మల్లాగే ఉంటున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. కాబట్టి ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా పనిచేయలేరన్నది పెద్ద ఆశ్చర్యపోయే విషయమేమీ కాదన్నారు. అవసరం లేని కేసులు కోర్టు వరకు రాకుండా ఆపడంలో వారేమీ చేయలేకపోతున్నారన్నారు. ఆలోచించకుండానే బెయిల్ అప్లికేషన్లను తిరస్కరిస్తుంటారని, నిందితులకు లాభపడేలా విచారణ సమయంలో ఆధారాలను తొక్కిపెట్టేస్తుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి సంబంధించి ఓ స్వతంత్ర ఎంపిక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.