Atchannaidu: ఏపీ మంత్రి ఆళ్ల నాని అసలు ఏపీలోనే ఉన్నారా?: అచ్చెన్నాయుడు
- ఏపీ సర్కారు ఒమిక్రాన్ గురించి పట్టించుకోవట్లేదు
- ప్రజల ప్రాణాలకంటే కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యం
- వ్యాక్సినేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది
- ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేవు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీలో ఒమిక్రాన్ కేసుల గురించి వైసీపీ సర్కారు పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రజల ప్రాణాలకంటే కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
వ్యాక్సినేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉందని ఆయన చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ కరోనా కట్టడి కోసం ప్రయత్నాలు జరుపుతూ ముందుంటే ఏపీలో మాత్రం జగన్ కక్షసాధింపు చర్యల్లో ముందున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేవని ఆయన చెప్పారు. ఏపీ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని అసలు ఏపీలోనే ఉన్నారా? అని చురకలంటించారు. కరోనా విషయంలో జగన్ పేరుకు మాత్రమే సమీక్షలు జరుపుతున్నారని, వాటి వల్ల ఏం లాభమని అచ్చెన్నాయుడు నిలదీశారు.