Karnataka: ఒమిక్రాన్ ఎఫెక్ట్: కర్ణాటకలో మళ్లీ నైట్ కర్ఫ్యూ.. పెళ్లిళ్లు, ఇతర వేడుకలపైనా ఆంక్షలు

Karnataka Imposes Night Curfew Amid Raising Omicron Cases

  • రాత్రి 10 నుంచి వేకువజామున 5 వరకు కర్ఫ్యూ
  • ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు అమల్లో
  • సినిమా హాళ్లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులకు 50% కెపాసిటీతో అనుమతి
  • నూతన సంవత్సర వేడుకలపై నిషేధం

కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతుండడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కట్టడికి చర్యలను ప్రారంభించింది. మళ్లీ ఆంక్షలను విధించింది. ఈ నెల 28 (మంగళవారం) నుంచి పది రోజుల పాటు రాత్రి కర్ఫ్యూను అమలు చేయనుంది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూను పెట్టనుంది. ఇవాళ మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ నిర్ణయం తీసుకున్నారు. హోటళ్లు, బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు సగం సామర్థ్యంతోనే నడిపించనున్నారు. నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. పెళ్లిళ్లు, ఇతర వేడుకలను కేవలం 50 శాతం కెపాసిటీతోనే నిర్వహించుకునేలా ఆంక్షలు పెట్టారు.


ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్ చెప్పారు. దేశంలో 422 కేసులు నమోదైతే రాష్ట్రంలో 32 ఒమిక్రాన్ కేసులు వచ్చాయన్నారు. ఒమిక్రాన్ ను కట్టడి చేసేందుకు, దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు నివారణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఆసుపత్రుల్లో పడకలు, మౌలిక వసతులను పెంచుతున్నామని తెలిపారు. జనవరి 10 నుంచి 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, హెల్త్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ప్రికాషనరీ డోసులు వేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News