Muslim girl: యుక్తవయసుకు వస్తే వివాహం అన్నది ముస్లిం బాలిక ఇష్టమే: హైకోర్టు
- సంరక్షకుడికి జోక్యం చేసుకునే హక్కు లేదు
- పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు స్పష్టం
- యువ జంటకు రక్షణ కల్పించాలని ఆదేశం
‘‘ముస్లిం బాలిక యుక్తవయసుకు వస్తే చాలు. తన ఇష్టానికి అనుగుణంగా ఎవరినైనా వివాహం చేసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుంది. ఇరువురికీ సమ్మతమైన సదరు వివాహం విషయంలో జోక్యం చేసుకునే ఎటువంటి హక్కు బాలిక సంరక్షకుడికి ఉండదు. ఈ విషయం ‘ముస్లిం పర్సనల్ లా‘లో స్పష్టంగా ఉంది’’అని ఓ కేసు విచారణ సందర్భంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తేల్చి చెప్పింది.
17 ఏళ్ల ముస్లిం బాలిక ఒక హిందూ బాలుడ్ని పెళ్లాడింది. ఇందుకు బాలిక కుటుంబం అభ్యంతర పెట్టింది. దీంతో ఆ జంట రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ వివాహ వయసు అన్నది ముస్లింల చట్టానికి అనుగుణంగానే ఉందని విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. తమ కుటుంబ సభ్యుల అభిమతానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నందున (పిటిషనర్లు) రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను వారు హరించే పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. వారికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.