KTR: రద్దు చేసిన సాగుచట్టాలను తిరిగి తీసుకొస్తామన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన
- రైతుల సుదీర్ఘ పోరాటంతో సాగు చట్టాలు రద్దు
- రద్దు ప్రకటన చేస్తూ రైతులకు మోదీ క్షమాపణలు
- రద్దు చేసిన చట్టాలను సవరణలతో తీసుకొస్తామన్న మంత్రి
- కేంద్ర మంత్రి ప్రకటన అద్భుతమని కేటీఆర్ ఎద్దేవా
రైతుల సుదీర్ఘ పోరాటంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఈ సందర్భంగా రైతులకు ప్రధాని మోదీ క్షమాపణలు కూడా తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన రైతులు ఉద్యమాన్ని విరమించి ఇటీవలే స్వగ్రామాలకు చేరుకున్నారు. అయితే, తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
రద్దు చేసిన సాగు చట్టాలను సవరించి మళ్లీ తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రధానమంత్రి మోదీ రద్దు చేసిన చట్టాలను తిరిగి తీసుకొస్తామని వ్యవసాయ మంత్రి చెప్పడం అద్భుతమని ఎద్దేవా చేశారు. మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే మోదీ క్షమాపణలు, సాగు చట్టాల రద్దు వంటివన్నీ ఎన్నికల స్టంట్‌లో భాగమేనని అనిపిస్తోందన్నారు. బీజేపీపై దేశంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.