IITs: ఐఐటీ ఉత్తీర్ణులకు ఆఫర్ల పంట.. రూ.కోట్లాది రూపాయల వేతన ప్యాకేజీలు
- దేశీయంగా ఉద్యోగాలకే రూ 1.8 కోట్ల ప్యాకేజీ
- విదేశీ ఉద్యోగాలకు రూ.2.4 కోట్ల వరకు ఆఫర్
- పెరిగిన క్యాంపస్ నియామకాలు
ఐఐటీ పట్టభద్రులకు ఆఫర్ల పంట పండింది. మొదటిసారి దేశీయ ఉద్యోగాలకు సంబంధించి వేతన ప్యాకేజీలు రూ.కోట్లు పలికాయి. ప్రతిభావంతులను సొంతం చేసుకునేందుకు కంపెనీలు మంచి ప్యాకేజీలతో ముందుకు వచ్చాయి. ఐఐటీ ఢిల్లీ, బాంబే, కాన్పూర్, మద్రాస్, ఖరగ్ పూర్, రూర్కీ, గువహటి, వారణాసి.. ఈ ఐఐటీల క్యాంపస్ ప్లేస్ మెంట్ లలో ఈ ఏడాది దేశీయ ప్యాకేజీలు రూ.1.8 కోట్ల (వార్షిక) వరకు ఉన్నాయి. అదే విదేశీ ఉద్యోగాలకు ప్యాకేజీలు రూ.2.15-2.4 కోట్ల మధ్యనున్నాయి.
ఐఐటీ ఢిల్లీ విద్యార్థులకు 60 ఆఫర్లు వచ్చాయి. ఒక్కో ప్యాకేజీ సగటు వార్షిక వేతనం రూ.కోటికిపైనే ఉంది. ఇలా రూ.కోటికి పైగా వేతన ప్యాకేజీలకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ 49, మద్రాస్ 27, బాంబే 12, రూర్కీ 11, గువహటి 5 చొప్పున ఆఫర్లను అందుకున్నాయి. రూ.90 లక్షల నుంచి రూ.2.4 కోట్ల మధ్య మొత్తం తమ క్యాంపస్ విద్యార్థులకు ఈ ఏడాది 22 ఆఫర్లు వచ్చినట్టు ఐఐటీ ఖరగ్ పూర్ తెలిపింది. మొత్తం మీద ఈ ఏడాది ఐఐటీయన్లు 1200కుపైనే ఆఫర్లు అందుకోవడం గమనార్హం.
కంపెనీల మధ్య పెరిగిన పోటీ వాతావరణం వేతన ప్యాకేజీలు పెరిగేందుకు దారితీసినట్టు.. టెక్నాలజీ నైపుణ్యాలకు అనూహ్యమైన డిమాండ్ నెలకొనడంతో ఈ ఏడాది రికార్డు స్థాయి క్యాంపస్ ప్లేస్ మెంట్ లకు వీలు కల్పించినట్టు నిపుణులు చెబుతున్నారు.
‘‘ఐఐటీయన్లకు సాధారణంగా ఆర్థిక ఉత్థాన పతనాల నుంచి రక్షణ ఉంటుంది. పైగా ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో, గతంలో నియామకాల విషయంలో నత్తనడకన వ్యవహరించడం వల్ల కూడా డిమాండ్ ను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది’’అని ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్ వినయ్ శర్మ పేర్కొన్నారు.