Nagarjuna: నేటి యువత తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది: నాగార్జున
- 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో వరల్డ్ కప్ గెలిచిన భారత్
- కపిల్ జీవితం ఆధారంగా బయోపిక్
- '83' అని నామకరణం.. ఈ నెల 24న రిలీజ్
- తెలుగులో విడుదల చేస్తున్న నాగార్జున
భారత క్రికెట్ గర్వించదగ్గ ఆటగాడు కపిల్ దేవ్. ఆల్ రౌండర్ గా జట్టుకు విశిష్ట సేవలు అందించిన ఈ హర్యానా హరికేన్ ప్రస్థానం ఆధారంగా '83' పేరిట బయోపిక్ తెరకెక్కింది. 1983లో భారత జట్టు కపిల్ దేవ్ నాయకత్వంలోనే వరల్డ్ కప్ గెలిచి అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. దాంతో ఆయన బయోపిక్ కు '83' అని పేరుపెట్టారు. ఇందులో కపిల్ దేవ్ పాత్రను బాలీవుడ్ అగ్రహీరో రణవీర్ సింగ్ పోషించారు.
కాగా, ఈ సినిమాను తెలుగులో అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నాగార్జున, రణవీర్ సింగ్, భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
నాగార్జున మాట్లాడుతూ, ఇప్పటి యువత తప్పకుండా చూడాల్సిన సినిమా '83' అని పేర్కొన్నారు. 1983లో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రతి భారతీయుడు గర్వించాడని, ఆనాటి క్షణాలు భారతీయుల్లో ఎనలేని స్ఫూర్తిని నింపాయని తెలిపారు. దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రణవీర్ సింగ్, దీపిక పదుకొణే తదితరులు నటించారు. ఈ చిత్రం రేపు (డిసెంబరు 24) విడుదల కానుంది.