Botsa Satyanarayana: ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకుంటామంటే కుదరదు: నానికి ఏపీ మంత్రి బొత్స కౌంటర్

Botsa reacts to Nani comments on cinema tickets
  • ముదురుతున్న సినిమా టికెట్ల వ్యవహారం
  • టికెట్ రేట్ల తగ్గింపుపై టాలీవుడ్ ప్రముఖుల స్పందనలు
  • బాహాటంగా అసంతృప్తి వెలిబుచ్చిన నాని
  • ఇందులో ప్రేక్షకులను అవమానించడం ఏముందన్న మంత్రి  
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం మరింత ముదురుతోంది. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవడం పట్ల టాలీవుడ్ నుంచి బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నేడు హీరో నాని చేసిన వ్యాఖ్యలతో వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కాస్త ఘాటుగానే స్పందించారు.

ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే కుదరదు అని స్పష్టం చేశారు. మేమింతే... మా ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్లు అమ్ముకుంటాం అంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లాల స్థాయిలో అధికారులకు నివేదించాలని, ప్రభుత్వం పరిశీలిస్తుందని బొత్స పేర్కొన్నారు. మీకు నచ్చిన రేట్లకు సినిమా టికెట్లు అమ్ముకునేందుకు అనుతిస్తే ఒత్తిళ్లు లేనట్టా...! ధరలు నియంత్రిస్తే ఒత్తిళ్లు ఉన్నట్టా...! అని నిలదీశారు.

సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే సినిమా టికెట్ల ధరలు తగ్గించామని, ఇందులో ప్రేక్షకులను అవమానించడం ఏముంది? అని ప్రశ్నించారు. మార్కెట్లో వస్తువులకు ప్రతిదానికి ఎమ్మార్పీ అనేది ఉంటుందని, ఆ పరిమితికి మించి అమ్మకూడదు కదా! అంటూ హితవు పలికారు.
Botsa Satyanarayana
Nani
Cinema Tickets
Andhra Pradesh
Tollywood

More Telugu News