pocso court: కోరికలను నియంత్రణలో పెట్టుకోకపోతే భవిష్యత్తు అంధకారమే..!: రేప్ కేసులో పోక్సో కోర్టు వ్యాఖ్యలు
- స్నేహితురాలు ఉన్నది కోరికలను తీర్చేందుకు కాదు
- బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు
- యువతకు ఈ తీర్పుతో ఇచ్చే సందేశం ఇదేనన్న ముంబై కోర్టు
‘‘నియంత్రణలో పెట్టుకోలేని కోరికలు యుక్తవయసులోని (నిందితుడి వయసు) వారి కెరీర్, బంగారు భవిష్యత్తును నాశనం చేస్తాయి. నిందితుడికి మేము విధించిన శిక్ష నేటి యువతకు ఇదే సందేశాన్నిస్తుంది’’ అంటూ ఓ కేసు తీర్పు సందర్భంగా ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడిన 20 ఏళ్ల యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది.
‘‘పురుషుడు స్నేహితురాలిని (ఆపోజిట్ సెక్స్) కలిగి ఉండడం అంటే.. అతడి లైంగిక కోరికలను తీర్చేందుకు ఆమె ఉన్నట్టు కాదు’’ అని స్పెషల్ జడ్జ్ ప్రీతికుమార్ గులే పేర్కొన్నారు. బంగారు భవిష్యత్తు పునాదులు యవ్వనం తొలినాళ్లపైనే ఆధారపడి ఉంటాయన్నారు. దూరపు బంధువైన 13 ఏళ్ల స్నేహితురాలిపై నిందితుడు అత్యాచారం చేసినట్టు కోర్టు నిర్ధారించింది.
నిందితుడికి మరింత శిక్ష అవసరం లేదని.. అతడు అదే నేరాన్ని మళ్లీ, మళ్లీ చేయకపోవడం, తాను చేసిన చర్య తాలూకు పరిణామాలను అర్థం చేసుకున్నట్టు కోర్టు పేర్కొంది. నిందితుడు చేసిన పనితో బాధితురాలి వివాహానికి అడ్డంకి ఏర్పడిందని, ఇప్పటికే నిశ్చితార్థం కూడా రద్దయిన విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది.