babys: మాకు ఆడపిల్లలే కావాలి... దత్తత విషయంలో అమ్మాయిలకే ప్రాధాన్యమిస్తున్న వైనం!
- దత్తత దరఖాస్తుదారుల్లో ఆడపిల్లలను కోరుతున్న వారే అధికం
- వైకల్యం ఉన్న వారికి విదేశీయుల ప్రాధాన్యం
- తెలంగాణలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు 9,000
- కరోనాతో అనాథలైన వారిని అక్కున చేర్చుకునేందుకు సంసిద్ధత
కూతురు అంటే భారంగా చూసే రోజులు ఒకప్పుడేమో కానీ.. నేడు అటువంటి ఆలోచనా ధోరణి క్రమంగా కనుమరుగవుతోంది. వికసిస్తున్న కొద్దీ భారతీయ సమాజం ఆడబిడ్డను మరింత అపురూపంగా చూసుకునే దశకు మారుతోంది. కన్న ప్రేమకు నోచుకోని దంపతులు ఎక్కువ మంది ఆడ పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కన్నప్రేమకు దూరమైన దంపతులు.. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన వారిని దత్తత రూపంలో తమ బంధంలోకి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ఎంతో మంది చిన్నారులను తల్లిదండ్రుల్లేని అనాధలుగా మార్చేసింది. ఇటువంటి వారిని తమ పిల్లలుగా దత్తత ఇవ్వాలని కోరుతూ కొందరు విశాల హృదయాలతో ముందుకు వస్తున్నట్టు మహిళా శిశు సంక్షేమ అధికారులు చెబుతున్నారు.
ఆ విధంగా ప్రస్తుతం తెలంగాణలో దత్తత కోసం వేచి చూస్తున్న దరఖాస్తులు 9,000 వరకు ఉన్నాయని సమాచారం. ప్రమాదాల కారణంగా తమ పిల్లలను కోల్పోయిన వారు, సంతాన భాగ్యం లేని వారు, ఆ భాగ్యం ఉన్నా అనాథలను అక్కున చేర్చుకోవాలన్న పెద్ద మనుసున్నవారు ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.
స్థానిక దరఖాస్తుల్లో ఆడపిల్లలే కావాలని ఎక్కువ మంది అడుగుతున్నారట. కాకపోతే ఆరోగ్యవంతులైన పిల్లలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ, విదేశీయులు వైకల్యం ఉన్న వారినీ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. వారికి మెరుగైన వైద్యం చేయించేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తుండడం సంతోషదాయకం.
తెలంగాణలో పెళ్లయిన రెండేళ్లు నిండిన తర్వాతే దంపతులు దత్తత కోసం మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలోని కేంద్రీయ దత్తత ఏజెన్సీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులను సమీక్షించిన తర్వాతే అధికారులు ఏ విషయాన్నీ తేలుస్తారు. ఇందుకు సంబంధించి cara.nic.in పోర్టల్ ను చూడొచ్చు. ఆరోగ్యంతోపాటు, ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. దత్తత తీసుకునే వారికి ప్రాణాంతక వ్యాధులు ఉండకూడదు. ఒంటరి మహిళ అయితే ఆడశిశువును దత్తత తీసుకెళ్లొచ్చు. ముగ్గురు సంతానం ఉన్న వారికి దత్తత ఇవ్వరు.
దత్తత పేరుతో పిల్లలను తీసుకెళ్లిన తర్వాత వారిపై అధికారుల పర్యవేక్షణ రెండేళ్లపాటు ఉంటుంది. ఇబ్బంది పెడితే, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తిరిగి వెనక్కి తీసేసుకుంటారు.