ola: ఓలా రైడర్లకు ఊరట.. ట్రిప్ వివరాలు డ్రైవర్లకు ముందుగానే తెలిసే ఏర్పాటు చేసిన సంస్థ

ola came out with a solution to check the rides cancellation

  • ట్రిప్ వివరాలు నచ్చితేనే అంగీకరించొచ్చు
  • ఏ విధానంలో చార్జీ చెల్లించాలన్నదీ ముందుగానే తెలుస్తుంది 
  • మార్పులు చేసినట్టు ప్రకటించిన ఓలా

రైల్వేస్టేషన్ కు వెళ్లాలని క్యాబ్ బుక్ చేసుకుంటాం. కొద్ది సేపు వేచి చూసి, ఇక క్యాబ్ దగ్గరకు వచ్చేసిందనుకుని ఊపిరి తీసుకునేలోపే.. మొబైల్ మోగుతుంది. ఆన్ చేస్తే.. ‘ఓలా నుంచి.. డెస్టినేషన్ ఎక్కడ సర్’ అన్న ప్రశ్న ఎదురవుతుంది. ఫలానా లొకేషన్ అని చెప్పడం.. ఆ మార్గం నచ్చితేనే డ్రైవర్ రావడం, లేదంటే ఆ ట్రిప్ రద్దవడం.. ఇలాంటి అనుభవాలు పట్టణ వాసులకు మామూలే. ఒకవేళ రైడర్లు వెళ్లాల్సిన లొకేషన్ డ్రైవర్ కు నచ్చినా.. క్యాషా? ఆన్ లైన్ పేమెంటా? అని విచారించి, నగదు అయితేనే వచ్చేవారూ ఉంటున్నారు.

ఇలా ట్రిప్పులను రద్దు చేయడం వల్ల విలువైన సమయం వృథా అయిపోయి రైలు, విమాన సర్వీసులను అందుకోలేకపోయిన వారు ఎందరో ఉన్నారు. ఒకవైపు క్యాబ్ బుక్ చేసుకున్న వారికి ఈ తీరుతో అసహనం ఏర్పడుతుంటే.. క్యాబ్ డ్రైవర్లు కూడా ట్రిప్పులను కోల్పోతున్నారు. ఇది సంస్థ మనుగడకే ఇబ్బందికరమని గుర్తించిన ఓలా ఓ పరిష్కారంతో ముందుకు వచ్చింది.

సాధారణంగా క్యాబ్ డ్రైవర్లకు కస్టమర్ పాయింట్ కు వచ్చి, పికప్ చేసుకున్నట్టు ఓకే చేస్తే గానీ వారిని ఎక్కడకు తీసుకెళ్లాలన్నది తెలిసేది కాదు. ఇకమీదట డ్రైవర్లకు ట్రిప్ వివరాలు ముందుగానే తెలిసేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్టు ఓలా ప్రకటించింది. దాంతో అసలు ఆ ట్రిప్ ను అంగీకరించాలా? లేదంటే తిరస్కరించాలా? అన్నది వారి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ట్రిప్ చార్జీని ఏ విధానంలో చెల్లింపులు జరిపేదీ ముందుగానే తెలిసేలా ఓలా ఏర్పాట్లు చేసింది. దీంతో వారికి ఇష్టమైతేనే ట్రిప్పును అంగీకరించవచ్చు.

  • Loading...

More Telugu News