USA: అమెరికాలో ఒమిక్రాన్ విజృంభ‌ణ‌.. కొత్తగా లక్షా 81 వేల కరోనా కేసులు

corona bulletin in usa

  • క్రిస్మ‌స్, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల నేప‌థ్యంలో ఆందోళ‌న
  • వారం రోజుల్లోనే ఒమిక్రాన్ వ్యాప్తి ఆరు రెట్లు అధికం
  • కరోనా రోగుల్లో 24 గంట‌ల్లో 1,811 మంది మృతి
  • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీడియా స‌మావేశం
  • ఉచితంగా క‌రోనా ర్యాపిడ్ టెస్టులు చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌

అమెరికాలో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. అధికారులు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ అది అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. దీంతో క్రిస్మ‌స్, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల నేప‌థ్యంలో ఆందోళ‌న నెల‌కొంది. అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో కొత్తగా లక్షా 81 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

వాటిలో అధిక శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని వివ‌రించింది. వారం రోజుల వ్యవధిలోనే అమెరికాలో ఒమిక్రాన్ వ్యాప్తి ఆరు రెట్లు పెరిగిపోయింద‌ని తెలిపింది. కరోనా రోగుల్లో 24 గంట‌ల్లో 1,811 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని వివ‌రించింది.

దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. దేశ వ్యాప్తంగా ప్ర‌భుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంద‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఉచితంగా 50 కోట్ల క‌రోనా ర్యాపిడ్ టెస్టులు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. క‌రోనా బూస్టర్ డోసులు పంపిణీ చేస్తామ‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ వ్యాక్సిన్లు వేయించుకోవాల‌ని ఆయ‌న చెప్పారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా క‌రోనా బూస్టర్ డోసు తీసుకున్నారని బైడెన్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా, యూకేను కూడా క‌రోనా మ‌ళ్లీ క‌ల‌వ‌ర పెడుతోంది. ఆ దేశంలో 24 గంట‌ల్లో 90,629 కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

ఫ్రాన్స్ లోనూ 72,832, స్పెయిన్‌లో 49,823 కేసులు 24 గంటల్లోనే నమోదయ్యాయి. ప‌లు దేశాల్లో మ‌ళ్లీ క‌రోనా ఆంక్ష‌లు విధిస్తున్నారు. ప్ర‌పంచం క‌రోనా వ‌ల్ల మ‌రోసారి ముప్పు ఎదుర్కోనుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ యూర‌ప్ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్ హన్స్ క్లూగే కూడా ప్ర‌క‌టించారు.

  • Loading...

More Telugu News