Tollywood: ఏపీలోని సినిమా థియేట‌ర్ల‌కు షాక్‌.. అధికారుల విస్తృత త‌నిఖీలు

raids in theatres

  • క‌నీస నిబంధనలను పాటించని వాటిపై చ‌ర్య‌లు
  • నిన్న కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో తనిఖీలు
  • నేడూ త‌నిఖీలు కొన‌సాగించ‌నున్న అధికారులు

క‌నీస నిబంధనలను పాటించకుండా, ప్రేక్ష‌కుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించ‌కుండా న‌డుస్తోన్న థియేట‌ర్ల‌పై ఏపీ స‌ర్కారు ఉక్కుపాదం మోపుతోంది. అటువంటి థియేటర్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటోంది. థియేట‌ర్ల‌లో త‌నిఖీలు కొన‌సాగిస్తూ నిబంధ‌న‌లు పాటించని వాటిని అధికారులు సీజ్ చేస్తున్నారు.

ఏపీలోని కృష్ణా జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో నిన్న రాత్రి వ‌ర‌కు ఈ త‌నిఖీలు కొన‌సాగాయి. త‌నిఖీల‌పై థియేట‌ర్ల యాజ‌మాన్యాలు ఆందోళ‌న చెందుతున్నాయి. రానున్న‌ సంక్రాంతి పండగ వరకు అధికారులు తనిఖీలు చేయ‌నున్నారు. నిన్న‌ విజయవాడలోని పలు థియేటర్లలో రెవెన్యూ అధికారులతో క‌లిసి పోలీసులు తనిఖీలు చేశారు. ఇందులో జిల్లా కలెక్టర్ జె.నివాస్ కూడా పాల్గొన్నారు.

ఈ రోజు కూడా త‌నిఖీలు కొన‌సాగ‌నున్నాయి. విజ‌యవాడ అప్స‌ర థియేట‌ర్లో ఫ‌స్ట్ షో వేసే స‌మ‌యంలో పోలీసులు, సెకండ్ షో స‌మ‌యంలో క‌లెక్ట‌ర్ తనిఖీలు చేశారు. టికెట్ల‌ రేట్లు ఇత‌ర సౌక‌ర్యాలు, ఫైర్ సేఫ్టీ ప్ర‌మాణాలు, పార్కింగ్ సౌక‌ర్యాలను వారు ప‌రిశీలించిన‌ట్లు తెలిసింది. అలాగే, పీవీఆర్, అలంకార్, అన్నపూర్ణ, శైలజ థియేటర్ల‌తో పాటు మరికొన్ని థియేటర్లను తనిఖీలు చేశారు. టికెట్ల ధరల వివరాలను కూడా తెలుసుకున్నారు.

కొన్ని థియేటర్లలో స్నాక్స్‌ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. విజ‌య‌వాడ‌లోని అన్ని థియేటర్లను పరిశీలించిన అనంత‌రం ప్రభుత్వానికి నివేదిక‌ పంపుతామని పోలీసులు తెలిపారు. విజ‌య‌వాడ‌, చుట్టుప‌క్క‌ల ప్రాంతాలలో ఉన్న 47 థియేట‌ర్ల‌లో నిన్న త‌నిఖీలు కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం. నిన్న ఒక్క‌రోజే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 6 థియేట‌ర్ల‌ను సీజ్ చేయాల‌ని అధికారులు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా నేడు కూడా థియేట‌ర్ల‌లో త‌నిఖీలు చేయ‌నున్న నేప‌థ్యంలో థియేట‌ర్ల యాజ‌మాన్యాలు ప‌లు జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News