Shilpa Shetty: 'నిజానికి తిరుగుండదు..' అంటూ భర్తకు వత్తాసు పలికిన శిల్పాశెట్టి
- నిజంపై దురుద్దేశం దాడి చేయవచ్చు
- అజ్ఞానం దానిని ఎగతాళి చేయవచ్చు
- నిజం నిలిచే ఉంటుంది
- భర్తకు మద్దతుగా విన్ స్టన్ చర్చిల్ కోట్
బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి తన భర్త, పోర్న్ వీడియోలను నిర్మించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాను సమర్థిస్తూ మరోసారి వత్తాసు పలికింది. పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే అమాయకులైన యువతులతో పోర్న్ వీడియోలు తీస్తున్నాడంటూ రాజ్ కుంద్రాపై కేసు నమోదవడం తెలిసిందే. ఇదే కేసులో ఆయన జూలై 19న అరెస్ట్ కాగా, సెప్టెంబర్ 21న బెయిల్ పై విడుదలయ్యారు.
తనపై వచ్చిన ఆరోపణలపై కుంద్రా ఇటీవలే మొదటిసారి స్పందిస్తూ.. స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ‘‘నా జీవితంలో పోర్నోగ్రఫీ నిర్మాణం, పంపిణీలో అస్సలు పాలు పంచుకోలేదు. ఇదంతా నాకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం మాత్రమే’’అంటూ రాజ్ కుంద్రా తాను అమాయకుడినని చెప్పే ప్రయత్నం చేశారు. విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందంటూ, నిజం ఎప్పటికైనా వెలుగు చూస్తుందన్నారు. కానీ, దురదృష్టవశాత్తూ మీడియా మాత్రం తనను నిందితుడిగా పేర్కొంటూ తన కుటుంబాన్ని ఎంతో వేదనకు గురిచేస్తున్నట్టు ఆరోపించారు.
ఈ విషయంలో శిల్పాశెట్టి తన భర్తకు మద్దతుగా నిలిచారు. తాజాగా ఆమె దీనిపై స్పందిస్తూ బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ కోట్ ను ప్రస్తావించారు. ‘నిజం తిరుగులేనిది. దురుద్దేశం దానిపై దాడి చేయవచ్చు. అజ్ఞానం దానిని ఎగతాళి చేయవచ్చు. కానీ, చివరికి నిజం నిలిచే ఉంటుంది’’ అని శిల్పా పేర్కొన్నారు.