Anantapur District: వారిపై పెట్టిన కేసేంటి?.. మీరు చేసింది ఏంటి?: అనంత ఎస్పీ ఫకీరప్పపై హైకోర్టు ఆగ్రహం

AP High Court fires on Anantapur SP in tdp women leaders case

  • ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ మహిళా నేతలపై కేసు
  • ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు
  • కేసుకు, సోదాలకు సంబంధమేంటని ప్రశ్నించిన హైకోర్టు
  • అఫిడవిట్ పేరుతో సమర్పించిన దాంట్లో విషయం ఉందా? అని నిలదీత
  • రెండు వారాల్లో మరో అఫిడవిట్ సమర్పిస్తానన్న ఎస్పీ ఫకీరప్ప

పత్రికా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురంలో కొందరు టీడీపీ మహిళా నేతలపై నమోదైన కేసు, ఆ తర్వాతి పరిణామాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎస్పీ ఫకీరప్పపై ప్రశ్నల వర్షం కురిపించింది. మహిళలపై నమోదైన కేసుకు, వారి ఇళ్లలో సోదాలు చేయడానికి ఉన్న సంబంధమేంటని ప్రశ్నించింది. అసలేం జరుగుతోందో చెప్పాలని నిలదీసింది. ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం సోదాలు చేశారో చెప్పాలని ప్రశ్నించింది.

ఈ ఘటనపై దర్యాప్తు జరిపి అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశిస్తే.. దర్యాప్తు అధికారి నివేదిక జతచేసి అఫిడవిట్‌గా ఎలా సమర్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అఫిడవిట్‌లో ఏమైనా విషయం ఉందా? దానిని మీరు చూశారా? అని ప్రశ్నల వర్షం కురిపించింది.

ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుందని ఎస్పీని ప్రశ్నించగా రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేస్తానని ఎస్పీ సమాధానమిచ్చారు. దీంతో కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు టీడీపీ మహిళా నేతలకు ఇది వరకే కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News