Hyderabad: గురువారం పెళ్లి.. శుక్రవారం షాపింగ్.. అదే రోజు డబ్బు, బంగారంతో కొత్త పెళ్లి కూతురు పరార్

newly wed bride cheat husband hours after marriage
  • విజయవాడ లాడ్జీలో పెళ్లి చేసుకున్న బాధితుడు
  • యాదగిరిగుట్ట చేరుకుని వ్రతం 
  • హైదరాబాద్‌లో మూడు తులాల బంగారు గొలుసు, రూ. 40 వేల బట్టల షాపింగ్
  • ఇంటికి చేరుకున్న తర్వాత రూ. 2 లక్షలు, కొత్త బట్టలతో పరార్
నాలుగు పదుల వయసులో పెళ్లి చేసుకుని కొన్ని గంటలు కూడా గడవకముందే పెళ్లి కుమార్తె చేతిలో దారుణంగా మోసపోయాడో వ్యక్తి. రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన వ్యక్తికి 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ వెంటనే ఓ మిత్రుడి సాయంతో మధ్యవర్తిని కలిశాడు. అమ్మాయిని చూడమని చెప్పాడు.  అయితే, అందుకు లక్ష రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో అడిగినంత సమర్పించుకున్నాడు.

డబ్బులు అందుకున్న మధ్యవర్తి విజయవాడలో అమ్మాయి ఉందని చెప్పి బాధితుడిని అక్కడికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయికి ముందువెనక ఎవరూ లేరని చెప్పాడు. అమ్మాయి నచ్చడంతో  విజయవాడలోనే ఓ లాడ్జిలో గురువారం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి యాదగిరి గుట్ట చేరుకుని వ్రతం కూడా చేశారు.  ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేశారు. మూడు తులాల బంగారు గొలుసు, రూ. 40 వేల దుస్తులు కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి బాధితుడి స్వగ్రామానికి చేరుకున్నారు.

ఆ తర్వాత కాసేపటికే బీరువాలో బట్టలు సర్దుతున్నట్టు నటించిన కొత్త పెళ్లికూతురు అందులోని రూ. 2 లక్షలు, కొత్త దుస్తులను తన బ్యాగులో సర్దింది. ఆమెతో పాటు వచ్చిన యువతి నగరంలోని తన సోదరుడిని చూసేందుకు వెళ్తుందని చెప్పి కారును మాట్లాడి ఉంచింది. ఆ తర్వాత తనకు తలనొప్పిగా ఉందని, మందులు తీసుకురావాలని చెప్పి భర్తను మెడికల్  షాపునకు పంపింది. అతడటు వెళ్లగానే కారులో మహిళలిద్దరూ ఉడాయించారు.

కారులో దుస్తులు మార్చుకోవడం, వారి వ్యవహారం అనుమానాస్పదంగా ఉండడంతో కారు డ్రైవర్ ప్రశ్నించగా ఇద్దరూ కలిసి అతడిని బెదిరించారు. ఆపై ఎల్బీనగర్ వద్ద కారు దిగారు. మరోవైపు, కొత్త పెళ్లి కూతురు డబ్బు, నగలు, దుస్తులతో పరారైన విషయం తెలిసి లబోదిబోమన్న బాధితుడు నిన్న స్థానిక పెద్దలకు చెప్పి బోరుమనడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అందరూ కలిసి మధ్యవర్తిని నిలదీయగా, తనకు ఏ పాపం తెలియదని, ఆమె ఇంత పనిచేస్తుందని ఊహించలేకపోయానని వాపోయాడు. కాగా, ఇదంతా ఓ ముఠా పనేనని అనుమానిస్తున్నారు.
Hyderabad
Vijayawada
Marriage
Ranga Reddy District
Crime News

More Telugu News