dogs: ఎట్టకేలకు ఆ ‘హంతక వానరాల’ బందీ!
- పట్టుకున్నట్టు ప్రకటించిన అటవీ అధికారులు
- నాగ్ పూర్ కు తరలింపు
- సుమారు 300 కుక్క పిల్లల బలి
ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ వానరాల ప్రతీకారేచ్ఛకు సుమారు 300 కుక్క పిల్లలు బలైపోయాయి. ఒక్క కోతి పిల్లను చంపిన పాపానికి, గ్రామంలోని శునకజాతి అంతం చూశాయి. ఎట్టకేలకు ఆ వానరాలను బంధించినట్టు నాగ్ పూర్ అటవీ శాఖ విభాగం ప్రకటించింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్‌గావ్ తాలూకా లావుల్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది.
గ్రామంలో కుక్కపిల్ల కనిపిస్తే చాలు కోతులు పట్టుకుపోయి, ఎత్తైన చెట్టు లేదా ఇళ్లపై నుంచి కింద పడేస్తూ వాటిని హతమారుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ ఘోరం జరిగిపోయింది. గ్రామంలో ఒక్క కుక్క పిల్లనూ వదలకుండా అవి పగ, ప్రతీకారంతో వ్యవహరించడం స్థానికులను భయానికి గురి చేసింది.
దీనంతటికీ కారణం.. కొన్ని రోజుల క్రితం శునక మూక ఓ కోతి పిల్లను వెంటాడి చంపడమే! దీంతో అప్పటి నుంచి ప్రతీకారంతో రగలిపోతున్న కోతులు.. కుక్కపిల్ల కనిపిస్తే చాలు.. ఎత్తుకుపోయి చంపేస్తున్నాయి. అలా నెల రోజుల వ్యవధిలో 300కి పైగా కుక్కపిల్లలను చంపేశాయి.
గ్రామస్థుల ఆందోళనతో ఎట్టకేలకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. కుక్క పిల్లలను చంపేయడంలో ప్రధాన పాత్ర పోషించిన రెండు వానరాలను బంధించినట్టు ప్రకటించారు. వీటిని నాగ్ పూర్ కు తరలించి అక్కడి సమీపంలో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్టు తెలిపారు.