Andhra Pradesh: కొడాలి నాని, అంబటి రాంబాబు, వంశీ వల్ల పార్టీ నష్టపోతోందని వ్యాఖ్యానించిన వైసీపీ నేత ఇంటిపై దాడి

attack on Ongole ysrcp leader subba rao
  • బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల్లో వ్యాఖ్యలు
  • సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడికి పాల్పడిన 15 మంది
  • ఇంటి బయట ఉన్న ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టిన వైనం
  • దాడి అనంతరం సుబ్బారావు అదృశ్యం
  • ఆ తర్వాత సీఐ సుభాషిణికి ఫోన్ ద్వారా అందుబాటులోకి
ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కారణంగా పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని, వారి భాష, వ్యవహారశైలి కారణంగా వచ్చే ఎన్నికల్లో 20 శాతం వరకు ఓట్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించిన ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ నేత సుబ్బారావు గుప్తా ఇంటిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ నెల 12న జరిగిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అయింది.

ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న 15 మంది లంబాడీడొంకలోని సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడికి దిగారు. ఆ సమయంలో ఆయన ఇంటి వద్దలేరు. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఇంటి బయట ఉన్న ఆయన ద్విచక్రవాహనాన్ని తగలబెట్టారు. అయితే, దాడి, బెదిరింపుల తర్వాత సుబ్బారావు అదృశ్యమయ్యారు. ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, ఆ తర్వాత ఒంగోలు ఒకటో పట్టణ సీఐ కేవీ సుభాషిణికి ఫోన్ ద్వారా సుబ్బారావు అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, వస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని సుభాషిణి చెప్పారు.
Andhra Pradesh
Prakasam District
Ongole
YSRCP
Subba Rao Gupta

More Telugu News