NV Ramana: వరంగల్ గొప్పతనాన్ని చాటుతూ ఓ కవిత చదివి వినిపించిన సీజేఐ ఎన్వీ రమణ
- తెలంగాణలో సీజేఐ పర్యటన
- ఫ్యామిలీ కోర్టు, పోక్సో కోర్టు ప్రారంభం
- ఓరుగల్లుతో ఆత్మీయ అనుబంధం ఉందన్న సీజేఐ
- ఓ కవిత చదివి వినిపించిన వైనం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణలో పర్యటిస్తున్నారు. నిన్న హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, నేడు హనుమకొండలో కోర్టు భవనాల సముదాయంతో పాటు ఫ్యామిలీ కోర్టు, పోక్సో కోర్టు భవనాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, హైకోర్టు జడ్జి నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, వరంగల్ ప్రాంతంతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని వెల్లడించారు. వరంగల్ లో 3 సాహిత్య పాఠశాలలకు హాజరయ్యానని తెలిపారు. ఈ క్రమంలో వరంగల్ గొప్పతనాన్ని చాటుతూ ఓ కవిత చదివి వినిపించారు. అద్భుత కట్టడాలు, ఆలయాలకు నెలవు ఓరుగల్లు అని వివరించారు. ఈ ప్రాంతం గొప్పదనాన్ని యునెస్కో కూడా గుర్తించిందని అన్నారు.
న్యాయవ్యవస్థల గురించి స్పందిస్తూ, కేసుల పెండింగ్ కు జడ్జిల కొరతే కాకుండా వసతుల కొరత కూడా కారణమేనని అభిప్రాయపడ్డారు. కోర్టుల్లో సదుపాయాలు కల్పించాలని కేంద్రాన్ని కోరినా స్పందన రాలేదని తెలిపారు. వరంగల్ కోర్టు భవనాన్ని మోడల్ కోర్టు భవనంగా అన్ని రాష్ట్రాలకు సూచిస్తానని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కోర్టు భవనాలు నిర్మించాలని స్పష్టం చేశారు. హనుమకొండలో కోర్టు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు. భవన నిర్మాణానికి సహకరించిందంటూ తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరానని, మొబైల్ నెట్వర్కింగ్ సిస్టమ్ ద్వారా గ్రామీణులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. లేనిపక్షంలో గ్రామ ప్రాంతాల వారు న్యాయానికి దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
అటు, చట్టసభల్లో న్యాయవాదుల పాత్ర తగ్గిందని సీజేఐ అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజంలో న్యాయవాదులకు ఎంతో గౌరవం ఉంటుందని అన్నారు. కుటుంబం ఎంత ముఖ్యమో సామాజిక స్పృహ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. దేశం, సమాజం పట్ల మరింత బాధ్యత పెంపొందించుకోవాలని వ్యాఖ్యానించారు.