GVL Narasimha Rao: అమరావతే రాజధాని అని కేంద్రం కూడా ఒప్పుకుంది: జీవీఎల్
- ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలి
- రాయలసీమలో హైకోర్టు ఉండాలని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే చెప్పాం
- సీమ అభివృద్ధికి బీజేపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది
ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలని... ఇదే బీజేపీ స్టాండ్ అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని కేంద్రం కూడా ఒప్పుకుందని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు ఉండాలని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తాము చెప్పామని... అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హైకోర్టు విషయం ఇప్పుడే తేలేలా లేదని అన్నారు. అనంతపురం జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరైన జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ మంది సీఎంలు రాయలసీమ నుంచే వచ్చారని... అయినప్పటికీ రాయలసీమ అభివృద్ధి చెందలేదని జీవీఎల్ అన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా పూర్తిగా వెనుకబడి ఉందని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోందని చెప్పారు. అందుబాటులో ఉన్న అవకాశాలను ఏపీ ప్రభుత్వం వాడుకోవడం లేదని విమర్శించారు.