Spider Man: No Way Home: 'స్పైడర్ మ్యాన్' కొత్త సినిమా సాయంతో వల విసురుతున్న సైబర్ మోసగాళ్లు
- స్పైడర్ మ్యాన్ సిరీస్ లో కొత్త చిత్రం
- విడుదలకు ముందే చూపిస్తామంటూ మోసగాళ్ల వల
- వివరాల నమోదు పేరిట టోకరా
- క్రెడిట్ కార్డు వివరాలు చేజిక్కించుకుని మోసాలు
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించే సూపర్ హీరోల్లో స్పైడర్ మ్యాన్ ఒకడు. స్పైడర్ మ్యాన్ పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా స్పైడర్ మ్యాన్ సిరీస్ లో 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' అనే చిత్రం తెరకెక్కింది. అయితే, సైబర్ మోసగాళ్లు ఈ చిత్రం సాయంతో వల విసిరినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్ స్కీ వెల్లడించింది.
ఈ సినిమాను విడుదలకు ముందే చూడొచ్చంటూ మోసగాళ్లు ఇంటర్నెట్ లో స్పైడర్ మ్యాన్ అభిమానులను ఊరిస్తూ కొన్ని వెబ్ సైట్ల లింకులు ఉంచారని తెలిపింది. ఆ లింకులను క్లిక్ చేయగానే, మీ వివరాలు నమోదు చేసుకోండి అంటూ కొన్ని సూచనలు కనిపిస్తాయని, వారు చెప్పినట్టే రిజిస్టర్ చేసుకుంటే అంతే సంగతులు అని పేర్కొంది.
ఆ వివరాల్లో భాగంగా క్రెడిట్ కార్డు వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. ఇంకేముంది, రిజిస్ట్రేషన్ పూర్తయిన కాసేపటికే వారి ఖాతాలో ఉన్న మొత్తం కూడా ఖాళీ అవుతుందని, క్రెడిట్ కార్డు వివరాలు దొంగిలించిన సైబర్ మోసగాళ్లు బ్యాంకు ఖాతాల నుంచి ఊడ్చేస్తున్నారని కాస్పర్ స్కీ వెల్లడించింది. స్పైడర్ మ్యాన్ కొత్తం చిత్రం మేనియాను ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు ఈ విధమైన ఎత్తుగడలు వేస్తున్నారని తెలిపింది.