Pakistan: పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కానిది చేసి చూపించాడు
- ఒక క్యాలెండర్ ఇయర్ లో 2 వేల పరుగులు
- తొలి ఆటగాడిగా చరిత్ర
- 55 సగటు, 130 స్ట్రయిక్ రేట్ తో 45 ఇన్నింగ్స్ లలో ఘనత
- అందులో 18 అర్ధ సెంచరీలు
పాక్ క్రికెటర్, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కానిది చేసి చూపించి ప్రపంచ రికార్డు లిఖించాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో 2 వేల పరుగులు చేసి.. ఈ ఫీట్ సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు. నిన్న వెస్టిండీస్ తో కరాచీలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో అతడు ఈ ఘనతను అందుకున్నాడు.
208 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముందు నుంచీ దూకుడుగానే ఆడిన రిజ్వాన్.. ఇన్నింగ్స్ 11వ ఓవర్ లో ఫోర్ తో ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా ఈ ఏడాది 45 ఇన్నింగ్స్ లు ఆడిన రిజ్వాన్.. 55 సగటు, 130 స్ట్రైక్ రేట్ తో 2,036 పరుగులు సాధించాడు. అందులో 18 అర్ధ సెంచరీలున్నాయి.
కాగా, ఇప్పటికే ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బాబర్ ఆజమ్ పేరు మీదున్న (1,779) రికార్డును ఇప్పటికే రిజ్వాన్ చెరిపేశాడు. బాబర్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో విండీస్ విధ్యంసక వీరుడు క్రిస్ గేల్ ఉన్నాడు. 2015లో అతడు 1,665 పరుగులు చేశాడు. 2016లో 1,614 పరుగులు చేసిన కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.
కాగా, విండీస్ తో మ్యాచ్ లో 18.5 ఓవర్లలో పాకిస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్ష్య ఛేదనలో బాబర్ ఆజమ్, రిజ్వాన్ లో ఆరోసారి శతక భాగస్వామ్యం నమోదు చేశారు. రోహిత్ శర్మ–కేఎల్ రాహుల్ పేరు మీదున్న రికార్డును చెరిపేశారు. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఐదుసార్లు ఈ ఫీట్ ను సాధించింది.