Karnataka: 'అత్యాచారం' ఘటనలపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Congress MLA KR Ramesh Kumar controversial comments on women in assembly

  • అసెంబ్లీలో వరదలు, పంట నష్టంపై చర్చ
  • ఒకరితర్వాత ఒకరు మాట్లాడుతుండడంతో నియంత్రణ కోల్పోయిన స్పీకర్
  • మాట్లాడుకోండంటూ సభను వదిలేసిన వైనం
  • గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేసిన కేఆర్ రమేశ్ కుమార్

స్పీకర్‌ను ఉద్దేశించి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. అత్యాచారం తప్పదనుకున్నప్పుడు దానిని ఆస్వాదించడమే మేలని, మీరిప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని స్పీకర్‌ విశ్వేశ్వర్ హెగ్డేను ఉద్దేశించి ఆయన అన్నారు.

ఇటీవల సంభవించిన వరదలు, పంట నష్టంపై నిన్న అసెంబ్లీలో ఒకరి తర్వాత ఒకరిగా మాట్లాడుతూ ఉండడంతో సభను నియంత్రించడం స్పీకర్‌కు కష్టంగా మారింది. దీంతో స్పీకర్ విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. 'పరిస్థితిని నియంత్రించేందుకు చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని అనుకుంటున్నాను.. మాట్లాడుకోండి' అన్నారు అసహనంతో.

దీంతో కల్పించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్.. ‘‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దానిని ఆస్వాదించడమే మేలు’’ అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాగా, 2019లోనూ రమేశ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో స్పీకర్‌గా ఉన్న ఆయన తన పరిస్థితి అత్యాచార బాధితురాలిలా ఉందని చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి.

‘‘అత్యాచారం జరిగినప్పుడు దానిని అక్కడితో వదిలేస్తే ఒకసారితో అయిపోతుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితుడిని జైలులో పెడతారు. కానీ లాయర్లు వదలరు. ఎన్నిసార్లు జరిగింది? ఎంతమంది చేశారు? అని ప్రశ్నలు అడుగుతారు. అత్యాచారం ఒకసారే జరుగుతుంది. కానీ కోర్టులో వందసార్లు జరుగుతుంది. ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది’’ అని అప్పట్లో రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు..

  • Loading...

More Telugu News