Amazon Prime: నెట్ ఫ్లిక్స్ ధరలు తగ్గాయి.. ఇకపై రూ.199కే టీవీలో చూడొచ్చు
- ఓటీటీ రంగంలో భిన్నమైన పరిస్థితి
- సబ్ స్క్రిప్షన్ ధరలు 50 శాతం వరకు పెంచిన అమెజాన్ ప్రైమ్
- భారీగా ధరలు తగ్గించిన నెట్ ఫ్లిక్స్
- రూ.149కే నెల రోజుల సభ్యత్వం
భారత ఓటీటీ రంగంలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. అమెజాన్ ప్రైమ్ తన సబ్ స్క్రిప్షన్ ధరలు పెంచగా, నెట్ ఫ్లిక్స్ ధరలు తగ్గించింది. అమెజాన్ ప్రైమ్ దాదాపు తన ధరలపై 50 శాతం పెంపు విధించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఏడాది రుసుము ఇప్పటిదాకా రూ.999 ఉండగా, ఇకపై ఏడాది సభ్యత్వానికి రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది.
అదే సమయంలో నెలవారీ రుసుమును కూడా అమెజాన్ ప్రైమ్ పెంచేసింది. ఇప్పటిదాకా నెలకు రూ.129 చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు అది రూ.179కి పెరిగింది. పెంచిన ధరలు డిసెంబరు 14 నుంచే అమల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. క్వార్టర్లీ ప్యాక్ ధర రూ.329 ఉండగా, ఇప్పుడది రూ.459 అయింది.
మరోపక్క అటు, నెట్ ఫ్లిక్స్ తన సబ్ స్క్రిప్షన్ ధరలు తగ్గించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓటీటీ రంగంలో నెలకొన్న పోటీయే నెట్ ఫ్లిక్స్ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు. మొబైల్ ఫోన్లలో నెట్ ఫ్లిక్స్ వీక్షించేందుకు ఇకపై నెలకు రూ.149 చెల్లిస్తే చాలు. ఇంతకుముందు అది రూ.199 ఉండేది.
అదే సమయంలో టీవీలో నెట్ ఫ్లిక్స్ వీక్షించేవారికి ఎంతో వెసులుబాటు కలగనుంది. బేసిక్ ప్లాన్ ధర గతంలో రూ.499 ఉండగా, ఇప్పుడు దానిని రూ.199కి తగ్గించారు. గతంలో స్టాండర్డ్ ప్లాన్ రూ.649 ఉండగా, ఇప్పుడది రూ.499 అయింది. ఇంతకుముందు ప్రీమియం ప్లాన్ రూ.799 ఉండగా, ఇప్పుడు రూ.649 చెల్లిస్తే సరిపోతుందని నెట్ ఫ్లిక్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.