AP Employees: ఐఏఎస్ లు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దు: సీఎం జగన్ కు ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞప్తి
- సీఎం జగన్ కు సీఎస్ కమిటీ నివేదిక సమర్పణ
- సజ్జలతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు
- సీఎం జగన్ న్యాయం చేస్తారన్న బండి శ్రీనివాస్
- ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని వెల్లడి
పీఆర్సీ, ఫిట్ మెంట్, సీపీఎస్ తదితర అంశాలపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ కమిటీ ఓ నివేదిక రూపొందించడం తెలిసిందే. సీఎస్ సమీర్ శర్మ ఆ నివేదికను నిన్న సీఎం జగన్ కు సమర్పించారు. దీనిపై నేడు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు.
అనంతరం, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత బండి శ్రీనివాస్ స్పందిస్తూ, ఐఏఎస్ లు తయారుచేసిన నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. సీఎం జగన్ తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. సీఎస్ ఇచ్చిన నివేదికతో ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుందే తప్ప, ఉద్యోగులకు ఆమోదయోగ్యం కాదని ఇవాళ సజ్జలకు వివరించామని, నివేదికపై ఉద్యోగుల భయాందోళనలు ఆయన దృష్టికి తీసుకెళ్లామని శ్రీనివాస్ తెలిపారు.
మరో నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులు కోరుకున్న విధంగా సీఎస్ కమిటీ ప్రతిపాదనలు లేవని విమర్శించారు. ఉద్యోగుల్లో అత్యధికులు దీనిపై అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు.