South Africa: కరోనా బారిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స

South African President Cyril Ramaphosa Tests Positive For corona

  • ఇటీవల నాలుగు పశ్చిమాసియా దేశాల సందర్శన
  • ఈ నెల 8న నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్
  • స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న అధ్యక్షుడు
  • ఆయన కోలుకునేంత వరకు ఉపాధ్యక్షుడికి బాధ్యతలు

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. సిరిల్ ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నట్టు పేర్కొంది. కాగా, ఇక్కడే గత నెలలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను నెమ్మదిగా చుట్టేస్తోంది. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఈ వేరియంట్ వెలుగు చూసింది. భారత్‌లోనూ ఇది చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా 38 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

అధ్యక్షుడు రామఫోసా కేప్‌టౌన్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఆయన కోలుకునేంత వరకు ఉపాధ్యక్షుడు డేవిడ్ మాబుజా ఆయన విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నాయి. అధ్యక్షుడు ఇటీవల నాలుగు పశ్చిమాసియా దేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా నాలుగు దేశాల్లోనూ ఆయనకు, ఆయన బృందానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అప్పట్లో అందరికీ నెగటివ్ గానే నిర్ధారణ అయింది. ఈ నెల 8న జొహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్న తర్వాత మరోమారు పరీక్షలు జరపగా అప్పుడు కూడా నెగటివ్ గానే తేలింది.

అధ్యక్షుడిని కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు పేర్కొన్నారు. సోదరుడు సిరిల్ రామఫోసా కరోనా బారినపడినట్టు తెలిసి చాలా బాధపడ్డానని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మరింత దృఢంగా ఉండాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News