England: బ్రిటన్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి.. భారీ ప్రాణనష్టం తప్పదని హెచ్చరిక
- వైరస్‌కు అడ్డుకట్ట వేయకపోతే ఏప్రిల్ నాటికి 75 వేల మరణాలు
- ఆల్ఫా వేరియంట్ కంటే దారుణ పరిస్థితులు
- రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిని ఇది వదలిపెట్టదు
- శనివారం ఒక్కరోజే బ్రిటన్‌లో దాదాపు 600 కేసులు
కరోనా వైరస్ నయా వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ఇది అత్యంత వేగంగా విస్తరిస్తోందని, దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరగకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 25 నుంచి 75 వేల మంది ఈ వేరియంట్ బారినపడి మరణించే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది.
అంతేకాదు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా 60 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్, దక్షిణాఫ్రికాలోని స్టెల్లెన్‌బోష్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత, టీకాల ప్రభావం ఆధారంగా వారు ఈ నిర్ణయానికి వచ్చారు.
ఒమిక్రాన్ అణచివేతకు ఇప్పటి నుంచే కఠిన చర్యలు తీసుకోకపోతే గతేడాది ఆల్ఫా వేరియంట్ విరుచుకుపడినప్పుడు తలెత్తిన కేసుల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. దీని వ్యాప్తి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, రోగ నిరోధకశక్తి ఉన్నవారు సులభంగా దీని బారినపడే అవకాశం ఉందని పేర్కొంది.
ఇంగ్లండ్‌లో శనివారం ఒక్కరోజే దాదాపు 600 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీని ఉద్ధృతి ఇలాగే కనుక కొనసాగితే ఈ నెలాఖరు నాటికే వీటి సంఖ్య 10 లక్షలు దాటిపోవచ్చని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ ఇటీవల పేర్కొనడం ఒమిక్రాన్ సంక్రమణ తీవ్రతకు అద్దం పడుతోంది.