Ambati Rambabu: పవన్ కల్యాణ్ కు దమ్ముంటే బీజేపీ ఆఫీసు ముందు ప్లకార్డు పట్టుకోవాలి: అంబటి రాంబాబు కౌంటర్

Ambati Rambabu counters Pawan Kalyan remarks

  • విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా పవన్ దీక్ష
  • ఏపీ సర్కారుపై వ్యాఖ్యలు
  • కౌంటర్ ఇచ్చిన అంబటి రాంబాబు
  • నువ్వొక రాజకీయనాయకుడివా? అంటూ ఆగ్రహం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ సర్కారు పోరాడాలంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. చేతగానివాళ్లు చట్టసభల్లో కూర్చోవడం ఎందుకంటూ పవన్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు అంబటి అదే రీతిలో బదులిచ్చారు.

"పోరాడడం అంటే ఏమిటి? ప్రతి సందర్భంలోనూ ప్రశ్నిస్తూనే ఉన్నాం కదా. లేకపోతే ఈయనతో కలిసి మేం పోరాడాలా? పవన్ కల్యాణ్ కు దమ్ముంటే బీజేపీ ఆఫీసు ముందు ప్లకార్డు పట్టుకోవాలి" అంటూ అంబటి సవాల్ విసిరారు. "రాష్ట్ర ప్రజలపై గౌరవం ఉంటే, విశాఖ ఉక్కు పరిశ్రమపై నిజంగా ప్రేమే ఉంటే మీ జనసేనను ప్లకార్డు పట్టుకుని బీజేపీ ఆఫీసు ముందు నిలబడమనండి" అంటూ స్పష్టం చేశారు.

"ఏం... మంగళగిరిలో పెట్టావా మీటింగు? ప్రైవేటీకరణ నిర్ణయాన్ని బీజేపీ తక్షణమే ఉపసంహరించుకోవాలి అని చెప్పే ధైర్యం లేని నువ్వొక రాజకీయనాయకుడివా? నిన్ను ప్రజలు నమ్మాలా? అయినా మా మీద పడతావేంటయ్యా నువ్వు..? ఇది రాష్ట్ర ప్రభుత్వ సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్రంతో అంటకాగుతోంది నువ్వు. సీట్ల పంపకాలు చేసుకుంటోంది నువ్వు. అంత సఖ్యతగా ఉంటున్న నువ్వు విశాఖ ఉక్కు గురించి కేంద్రంతో మాట్లాడలేకపోతున్నావే... ఏమిటి గుట్టు? అని ప్రశ్నించారు.

"ఈ విషయంలో సీఎం జగన్ పై విమర్శలు చేయడం సరికాదు... దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. కొందరు సైకో ఫ్యాన్స్ ఈలలు వేస్తే అదే ప్రపంచం అనుకుంటే మళ్లీ పప్పులో కాలేస్తావు జాగ్రత్త!" అని హెచ్చరించారు. "జగన్ మంచి చేస్తే పొగడలేడు... చంద్రబాబు దుర్మార్గం చేస్తే ప్రశ్నించలేడు... ఈ రెండు కలిస్తే పవన్ కల్యాణ్" అంటూ విమర్శించారు.

Ambati Rambabu
Pawan Kalyan
Vizag Steel Plant
YSRCP
Janasena
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News