Rahul Gandhi: నాతో పాటు వీళ్లందరూ హిందువులు... వాళ్లు మాత్రం హిందుత్వవాదులు: రాహుల్ గాంధీ

Rahul Gandhi slams BJP on Hinduthva Raj
  • రాజస్థాన్ లోని జైపూర్ కాంగ్రెస్ భారీ సభ
  • హాజరైన సోనియా, రాహుల్
  • బీజేపీపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ అగ్రనేత
  • హిందుత్వ, హిందు తేడా వివరించిన వైనం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాజస్థాన్ లోని జైపూర్ లో నిర్వహించిన భారీ సభకు ఆయన తన తల్లి సోనియా గాంధీతో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందుత్వ అంశంపై వ్యాఖ్యలు చేశారు.

"నేను హిందువుని, వీళ్లందరూ హిందువులే.. కానీ వాళ్లు మాత్రం హిందుత్వవాదులు. అదెలాగో నేను చెబుతాను. మహాత్మాగాంధీ సత్యాగ్రహం పేరిట సత్యం కోసం అన్వేషించారు. కానీ నాథూరామ్ గాడ్సే ఆయన దేహంలోకి మూడు బుల్లెట్లు దింపాడు. అతడొక హిందుత్వవాది. హిందువైన ప్రతి ఒక్కరూ సత్యాన్వేషణలో ఆసక్తి చూపుతారు. హిందుత్వవాదులు మాత్రం అధికారం కోసం వెంపర్లాడతారు. వారికి సత్యంతో పనిలేదు. హిందుత్వవాదులకు సత్యాగ్రహం అంటే అధికారం కోసం అన్వేషణ మాత్రమే" అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

"ఎవరు హిందువు?... ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూ దేనికి భయపడనివాడు హిందువు. కానీ నేడు అధికారంలో ఉన్నవాళ్లు నకిలీ హిందువులు. భారత్ లో ప్రస్తుతం హిందూ రాజ్ కు బదులు హిందుత్వవాది రాజ్ నడుస్తోంది. ఈ హిందుత్వ రాజ్ ను నిర్మూలించి హిందూ రాజ్ ను తీసుకురావాల్సిన అవసరం ఉంది" అంటూ పిలుపునిచ్చారు.
Rahul Gandhi
BJP
Hindu
Hinduthva
Congress
India

More Telugu News