Mumtaz Ahmed Khan: సలామ్ చేయలేదంటూ నన్ను కొట్టారు... చార్మినార్ ఎమ్మెల్యేపై ఓ వ్యక్తి ఫిర్యాదు

Complaint against Charminar MLA

  • వివాదంలో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్
  • తనపై దాడి చేశారన్న గులాం గౌస్ జిలానీ
  • సీసీటీవీ ఫుటేజి పరిశీలించాలని పోలీసుల నిర్ణయం

ఎంఐఎం నేత, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తనపై అకారణంగా చేయి చేసుకున్నారంటూ గులాం గౌస్ జిలానీ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన హుస్సేనీ ఆలం పోలీసులు సీసీటీవీ ఫుటేజి పరిశీలించాలని నిర్ణయించుకున్నారు.

ఫిర్యాదుదారు గులాం గౌస్ జిలానీ మీడియాతో మాట్లాడుతూ, చార్మినార్ బస్టాండ్ సమీపంలోని తన ఇంటి వద్ద కూర్చుని ఉండగా, ఎమ్మెల్యే తన అంగరక్షకులతో వచ్చి తనను కొట్టారని వెల్లడించారు. ఎందుకు కొట్టారని అడిగితే నువ్వు నాకు సలామ్ చేయలేదు అంటూ ఎమ్మెల్యే బదులిచ్చారని తెలిపారు. అతడిని తాను చూడలేదని, అతడికి తానెందుకు సలామ్ చేయాలని జిలానీ ప్రశ్నించారు. ఎమ్మెల్యే బంధువులు కూడా తనను కాల్చిపారేస్తామంటూ బెదిరించారని వెల్లడించారు.

ఈ అంశాన్ని తాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి కూడా తీసుకెళ్లానని, కానీ ఆయన సంయమనం పాటించాలని సూచించారని, అయితే ఇది వదిలేయాల్సిన అంశం కాదని జిలానీ పేర్కొన్నారు.

కాగా, బాధితుడు జిలానీ కుటుంబం కూడా ఎంఐఎం పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. జిలానీ సోదరుడు మహ్మద్ మన్నత్ ఎంఐఎం నేత. చార్మినార్ ఎమ్మెల్యేను పార్టీ నుంచి తొలగించాలంటూ ఆయన కూడా ఒవైసీకి విజ్ఞప్తి చేశారు. "ఆయనేమన్నా దేవుడా ప్రతిసారి సలామ్ చేయడానికి!" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Mumtaz Ahmed Khan
Charminar MLA
Slap
Complaint
Police
  • Loading...

More Telugu News