Andhra Pradesh: సీఎంపై గౌరవంతో ఇంతకాలం ఆగాం: ఉద్యోగ సంఘాల నేతలు

AP Employees leaders decided to continue agitations
  • ఉద్యమ బాటలో ఏపీ ఉద్యోగ సంఘాలు
  • ఈ నెల 13న తాలూకాల్లో నిరసన ప్రదర్శనలు
  • డిమాండ్ల సాధన కోసం ఉద్యమం కొనసాగుతుందన్న నేతలు
  • సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని స్పష్టీకరణ
తమ డిమాండ్ల సాధన పూర్తయ్యేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. సీఎం జగన్ పై ఉన్న గౌరవంతో ఇంతకాలం ఆగామని, తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పీఆర్సీ సహా ఆర్థికేతర డిమాండ్లన్నింటిని పరిష్కరించాలని అన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు జీతాల పెంపు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ పీఆర్సీ వర్తింపుపై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. నిలిపి ఉంచిన ఏడు డీఏల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని, సీపీఎస్ రద్దు చేయకుండా ప్రత్యామ్నాయాలు వద్దని తెగేసి చెప్పారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే పిలుపునిచ్చిన మేరకు డిసెంబరు 13న తాలూకాల్లో నిరసన ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు.
Andhra Pradesh
Employees
CM Jagan
Demands
Agitations

More Telugu News