USA: తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది: అమెరికాకు చైనా వార్నింగ్
- చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరించిన అమెరికా
- ఒలింపిక్స్ పరువును దిగజార్చేలా వ్యవహరిస్తున్నారన్న చైనా
- అమెరికా బాటలోనే మరిన్ని దేశాలు
అమెరికా, చైనాల మధ్య వివాదం ముదురుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్ ను అమెరికా బహిష్కరించిన సంగతి తెలిసిందే. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలో ఒలింపిక్స్ ను దౌత్యపరంగా అమెరికా బహిష్కరించింది. ఈ నేపథ్యంలో చైనా తీవ్రంగా స్పందించింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. వింటర్ ఒలింపిక్స్ అనేది రాజకీయ వేదిక కాదని వ్యాఖ్యానించింది.
ఒలింపిక్స్ పరువును దిగజార్చేలా అమెరికా చర్యలు ఉన్నాయని చైనా మండిపడింది. పక్షపాతంతో వింటర్ ఒలింపిక్స్ లో జోక్యం చేసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు బహిర్గతమవుతున్నాయని చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియా, బ్రిటన్, లిథువేనియా, కెనడా దేశాలు కూడా చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి. మానవహక్కులను మంటకలిపేలా చైనా వ్యవహరిస్తోందని... అందుకే వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరిస్తున్నామని తెలిపాయి.