Ibrahim Ismail Ibrahim: దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారత సంతతి యోధుడి కన్నుమూత
- 13 ఏళ్ల పసిప్రాయంలోనే విముక్తి పోరాటంలోకి
- 18 ఏళ్లపాటు జైలు జీవితం
- ‘కామ్రేడ్ ఏబీ’ మరణంతో విషాదంలో దేశప్రజలు
- నెల్సన్ మండేలా హయాంలో మంత్రిగా పనిచేసిన ఇస్మాయిల్
13 ఏళ్ల వయసులోనే విముక్తి పోరాటంలో చేరి, దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారత సంతతి యోధుడు ఇబ్రహీం ఇస్మాయిల్ ఇబ్రహీం కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇస్మాయిల్ జొహన్నెస్‌బర్గ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో దేశ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ఇస్మాయిల్ మృతిపై ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) సంతాపం ప్రకటించింది. మానవత్వం, వినయం, అంకితభావం కలిగిన నేత అంటూ ప్రశంసించింది.
దక్షిణాఫ్రికాలో భారతీయుల కదలికలను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించినందుకు గాను ఇస్మాయిల్ తండ్రి రెండుసార్లు జైలుకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో 13 ఏళ్ల పసిప్రాయంలోనే ఇస్మాయిల్ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. దిగ్గజ నేతలైన నెల్సన్ మండేలా, అహ్మద్ కత్రడాలతో కలిసి రాబెన్ ద్వీపంలో ఏళ్ల తరబడి ఇస్మాయిల్ జైలు జీవితాన్ని గడిపారు.
అలా ఆయన తన జీవితంలో 18 సంవత్సరాలు జైలులోనే ఉన్నారు. ఖైదీగా ఉంటూనే రెండు యూనివర్సిటీ డిగ్రీలు సంపాదించారు. మహాత్మాగాంధీ సత్యాగ్రహ పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందని ఇస్మాయిల్ పలుమార్లు చెప్పారు. కాగా, నెల్సన్ మండేలా అధ్యక్షుడయ్యాక ఇస్మాయిల్ విదేశాంగశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. దేశప్రజలు ఆయనను కామ్రేడ్ ఏబీగా పిలుచుకునేవారు.