Asteroids: నేడు భూమికి సమీపం నుంచి దూసుకెళ్లనున్న 6 గ్రహశకలాలు.. వీటిలో ఒకదాని వేగం గంటకు 44 వేల కిలోమీటర్లు!
- గ్రహశకలాల గమనాన్ని పరిశీలిస్తున్న నాసా
- వీటిపై ఎలాంటి హెచ్చరికలు చేయని అమెరికా సంస్థ
- డిసెంబరు 11న మరో గ్రహశకలం రాక
- దీని నిడివి 330 మీటర్లు అని వెల్లడి
అనంత విశ్వంలో గ్రహాలు, నక్షత్రాలే కాదు గ్రహశకలాలు (ఆస్టరాయిడ్లు) కూడా భాగమే. గ్రహాలు, ఉపగ్రహాలతో పోల్చితే గ్రహశకలాలు చిన్నవే అయినా ఇవి అమితవేగంతో దూసుకెళుతుంటాయి. తాజాగా 6 ఆస్టరాయిడ్లు నేడు భూమికి సమీపం నుంచి వెళుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ ఆరింటిలో ఒక ఆస్టరాయిడ్ గంటకు 44,388 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేర్కొంది.
2021 వీఎక్స్7, 2021 డబ్ల్యూఈ1, 2021 డబ్ల్యూఎమ్2, 2021 ఎక్స్ టి1, 2021 డబ్ల్యూఎల్2, 2021 ఎక్స్ఈ అనే ఈ ఆరు గ్రహశకలాల గమనాన్ని నాసా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ గ్రహశకలాలు సూర్యుడి దిశగా వెళ్లే క్రమంలో భూగోళానికి దగ్గరగా వస్తున్నట్టు గుర్తించారు. అయితే వీటి వల్ల మానవాళికి ఏదైనా ప్రమాదం ఉందా అన్న విషయంపై నాసా ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. దాంతో వీటివల్ల భూమికి వచ్చే ముప్పేమీ లేదని స్పష్టమైంది.
ఇక, ఈ ఆరు గ్రహశకాల్లో 2021 డబ్ల్యూఎమ్2 అనేది అత్యంత వేగగామి అని నాసా చెబుతోంది. ఇది భూమికి 31,50,531 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది.
కాగా, డిసెంబరు 11న ఓ భారీ గ్రహశకలం భూమికి చేరువలోకి రానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి 4660 నెరియస్ అని నామకరణం చేశారు. దీన్ని 1982లో తొలిసారిగా పాలోమార్ అబ్జర్వేటరీ నుంచి గుర్తించారు. ఇది 330 మీటర్ల నిడివితో ఉంటుంది. భూమికి 39,34,424 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లనుంది.
అనేక దేశాలు నెరియస్ గురించి పరిశోధనలు చేపట్టాలని భావించినా అవి ప్రణాళికల దశలోనే ఆగిపోయాయి. ఇది భూమిని తాకితే అపారమైన ముప్పు తప్పదని నాసా తదితర అంతరిక్ష పరిశోధన సంస్థలు అప్పట్లోనే అంచనా వేశాయి. నెరియస్ తిరిగి 2031 మార్చి 2న భూమికి సమీపానికి వస్తుందని నాసా పేర్కొంది.